Entertainment

‘భీమా’ మూవీ రివ్యూ


సినిమా పేరు: భీమా

తారాగణం: గోపీచంద్, ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారీ 

సంగీతం: రవి బస్రూర్ 

డీఓపీ: స్వామి జె. గౌడ

ఎడిటర్: తమ్మిరాజు

దర్శకత్వం: ఎ. హర్ష

నిర్మాత: కె. కె. రాధామోహన్

బ్యానర్: శ్రీ సత్య సాయి ఆర్ట్స్

విడుదల తేదీ: మార్చి 8, 2024

మంచి కటౌట్, దానికి తగ్గ టాలెంట్ మాచో స్టార్ గోపీచంద్ సొంతం. మాస్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అయితే గోపీచంద్ భారీ విజయాన్ని అందుకొని చాలా కాలమైంది. సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మాచో స్టార్.. కన్నడలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఎ. హర్షతో చేతులు కలిపి భీమా సినిమా చేశాడు. గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర పోషించడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? గోపీచంద్ కి ఘన విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

మహేంద్రగిరి ప్రాంతంలో భవాని(ముఖేష్ తివారి) దుర్మార్గాలకు అడ్డు అదుపు లేదు. అతనికి అడ్డొస్తే పోలీసులను అయినా అంతం చేస్తాడు. ముఖ్యంగా అతను ట్యాంకర్లు ద్వారా రహస్యంగా ఏవో తరలిస్తుంటాడు. ఆ ట్యాంకర్ల జోలికి ఎవరైనా వస్తే అతనిలోని నరరూప రాక్షసుడు నిద్ర లేస్తాడు. అలా భవాని చేతుల్లో మగ్గుతున్న మహేంద్రగిరికి కొత్త ఎస్ఐగా భీమా(గోపీచంద్) వస్తాడు. భవాని ఆటలను భీమా అరికట్టగలిగాడా? ఆ ట్యాంకర్ల వెనుక దాగున్న రహస్యం ఏంటి? అసలు భవాని వెనుకున్న వ్యక్తి ఎవరు? భీమా గతం ఏంటి? మహేంద్రగిరిలో ఉన్న పురాతన శివాలయానికి ఈ కథకి సంబంధం ఏంటి? ఆ ఆలయం మూతపడటానికి కారణం ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

పురాణాలను, దేవుళ్లను ముడిపెడుతూ రాసుకున్న కథలతో ఈ మధ్య కొన్ని సినిమాలు వస్తున్నాయి. భీమా కూడా ఆ కోవలోకి చెందినవే. అయితే పరశురాముడిని, పరమశివుడి ఆలయాన్ని ముడిపెడుతూ కథ రాసుకొని.. ఒక పది నిమిషాలు శివాలయానికి సంబంధించిన సన్నివేశాలు చూపించి.. మిగతా అంతా రొటీన్ సన్నివేశాలు, కథకు అడ్డు తగిలే లవ్ ట్రాక్, పాటలు, ఫైట్లతో నింపేస్తే సినిమా హిట్ అవుతుంది అనుకుంటే పొరపాటే. భీమా సినిమా విషయంలో దర్శకుడు హర్ష అలాంటి పొరపాటే చేశాడు.

భీమా చిత్రం ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. మరణించిన తర్వాత దశదిన కర్మ వరకు మనిషి ఆత్మ భూమి మీదే ఉంటుంది. ఆ మరణించిన వ్యక్తి యొక్క రక్త సంబంధీకులు మహేంద్రగిరిలోని శివాలయంలో మనస్ఫూర్తిగా పూజ చేసి పిలిస్తే.. ఆత్మ వారి శరీరంలోకి ప్రవేశించి చివరి కోరిక తీర్చుకుంటుంది. అయితే ఆ కోరిక ధర్మ సమ్మతంగా ఉండాలి. ఈ పాయింట్ తో సినిమా మొదలవ్వడంతో దర్శకుడు ఏదో కొత్తగా చెప్పబోతున్నాడు అనే ఆసక్తి కలుగుతుంది. కానీ కాసేపటికే సినిమా ట్రాక్ తప్పి రొటీన్ కమర్షియల్ సినిమాలా మారిపోతుంది. హీరో ఇంట్రడక్షన్ ఫైట్, ఆ వెంటనే టైటిల్ సాంగ్, ఆ తర్వాత ఏమాత్రం ఆకట్టుకునేలా లేని లవ్ ట్రాక్ తో ప్రేక్షకులు సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది.

భవాని లాంటి దుర్మార్గుడి ఆట కట్టించడానికి వచ్చిన హీరో.. “వెంటనే వెంటనే ట్రాన్స్ఫర్లు అవ్వడం బోర్ కొడుతుంది, నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను, అప్పటివరకు వెకేషన్ లో ఉన్నాను అనుకుంటాను” అని చెప్పడం మరీ సిల్లీగా ఉంది. విలన్ ని పట్టించుకోకుండా, హీరోయిన్ తో ప్రేమ పాఠాలు చెప్పడం, ఆ ప్రేమ సన్నివేశాలు కూడా ఆకట్టుకోకపోవడంతో ఫస్టాఫ్ కే ప్రేక్షకులు డీలా పడిపోతారు. అయితే ఇంటర్వెల్ సన్నివేశం మాత్రం మెప్పించింది. సెకండాఫ్ లో ఏదో ఉందన్న ఆసక్తిని కలిగించేలా చేసింది.

సెకండాఫ్ లో అయినా ఏమైనా ఉంటుందా అంటే అదీ రొటీన్ గానే సాగింది. గోపీచంద్, నరేష్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు మాత్రం కొంతవరకు రిలీఫ్ ని ఇచ్చాయి. పతాక సన్నివేశాలు మెప్పించాయి. సినిమాకే హైలైట్ గా నిలిచాయని చెప్పవచ్చు. అయితే విలన్ భవాని వెనుకున్న వ్యక్తి ఎవరో రివీల్ అయినప్పుడు ప్రేక్షకులు పెద్దగా సర్ ప్రైజ్ అయ్యే అవకాశం లేదు. మొత్తానికైతే.. ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ తప్ప మిగతా సినిమా అంతా సప్పగానే సాగింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ, సెకండాఫ్ లో పండిన కామెడీ కొంతవరకు రిలీఫ్.

రవి బస్రూర్ సంగీతం పెద్దగా ప్రభావం చూపలేదు. పాటలు పూర్తిగా తేలిపోయాయి. నేపథ్య సంగీతం బాగానే ఉంది. స్వామి జె గౌడ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటర్ తమ్మిరాజు సినిమా నిడివిని కాస్త కుదించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

భీమా పాత్రలో గోపీచంద్ చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఎప్పటిలాగే చెలరేగిపోయాడు. తన స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కామెడీ సన్నివేశాల్లో కూడా తన మార్క్ చూపించాడు. హీరోయిన్లు మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్‌ ఉన్నంతలో బాగానే రాణించారు. ముఖేష్ తివారి, నాజర్, వెన్నెల కిషోర్, నరేష్, పూర్ణ, రఘు బాబు, చమ్మక్ చంద్ర తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా…

దర్శకుడు ఆసక్తికర కథాంశాన్నే ఎంచుకున్నాడు కానీ, దానిని రొటీన్ కమర్షియల్ సినిమాలా మలిచాడు. ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్, గోపీచంద్ యాక్షన్ తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

రేటింగ్: 2.25/5 

– గంగసాని



Source link

Related posts

రితికా సింగ్ వళరి మూవీ ఎప్పుడంటే!

Oknews

అఫీషియల్.. 'RC 16'లో సూపర్ స్టార్…

Oknews

12 సంవత్సరాల తర్వాత మరో బ్రేక్‌ కోసం టాలీవుడ్‌ వస్తున్న లారెన్స్‌!

Oknews

Leave a Comment