మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయి, రిమాండులో భాగంగా జైలు జీవితం గడుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది అనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతుంటారు.
చంద్రబాబు నాయుడుని అభిమానించే ప్రజలు, ఆరాధించే ఆయన పార్టీ కార్యకర్తలు చాలా సహజంగా ఈ అరెస్టు దుర్మార్గం అని, దారుణం అని, కక్ష సాధింపు అని విమర్శలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వైఎస్సార్ సీపీ మీద అభిమానం ఉన్నవారు.. ఆయన దుర్మార్గుడు.. వందలకోట్లు తినేసి తప్పించుకుని తిరగాలనుకుంటే కుదురుతుందా అని తిట్టిపోస్తుంటారు. అదే తటస్థులు అయితే.. ఆయన అవినీతి చేశాడో లేదో కోర్టులు తేలుస్తాయి. చేసి ఉంటే శిక్ష పడుతుంది.. లేకపోతే బయటకు వస్తాడు.. అని నిమ్మళంగానే ఉంటారు.
కానీ పచ్చమీడియా ప్రజాభిప్రాయాలను హైజాక్ చేయడానికి నిత్యం ప్రయత్నిస్తుంటుంది. చంద్రబాబునాయుడును అరెస్టు చేసినందుకు రాష్ట్రంలోని జనమంతా దురపిల్లుతున్నారని, ఆయన అరెస్టు పట్ల జనంలో సానుభూతి, జాలి వెల్లువెత్తుతున్నదని.. ఆయన పట్ల ఆదరణ అమాంతం పెరిగిపోతున్నదని రకరకాలుగా వండిన కథనాలను ప్రజల మెదళ్లలోకి దూరుస్తూ ఉంటుంది. కానీ అదంతా కూడా పిచ్చి భ్రమ.
చంద్రబాబునాయుడు ఏదైనా ప్రజాసమస్యల మీద పోరాడే ప్రయత్నంలో భాగంగా అరెస్టు అయి ఉంటే.. అప్పుడు నిజంగానే వారు కోరుకునే జాలి సానుభూతి ఆదరణ వచ్చేవేమో. కానీ.. ఆయన ప్రజల డబ్బును అడ్డగోలుగా స్వాహా చేసేసిన అవినీతి కేసులో అరెస్టు అయి ఉన్నారు. ప్రజల్లో సానుభూతి ఎందుకుంటుంది? ఆ లాజిక్ ను తెలుగుదేశం నాయకులు కూడా మిస్సయి భ్రమల్లో బతుకున్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసేవరకు చంద్రబాబును జైల్లో ఉంచాలనే కుట్రతోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో జగన్, ఆయనను ఇరికించారని అంటున్నారు. జగన్ ఇరికించిన సంగతి ఏమో గానీ.. ఎన్నికలు ముగిసేదాకా చంద్రబాబునాయుడు జైల్లోనే ఉండాలనే కోరిక అచ్చెన్నాయుడులో చాలా బలంగా ఉన్నట్లుంది. ఆయన జైల్లో ఉంటే సానుభూతి వెల్లువలో తమ పార్టీ ఈజీగా నెగ్గి అధికారంలోకి వస్తుందనే ఆశ కూడా ఆయనకు ఉన్నదేమో తెలియదు.
మొత్తానికి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే జరగకుండా అవినీతి ఏమిటి? అనే ప్రశ్నలతో ఒకవైపు పుస్తకాలు ముద్రిస్తూనే.. ఆ కేసులో ఇరికించడం వలన.. ఎన్నికలు ముగిసే దాకా జైలునుంచి బయ టకు వచ్చే పరిస్థితి ఉండదని చెబుతుండడాన్ని గమనిస్తే.. ఐఆర్ఆర్ లో అవినీతి నిజమేనని వారి మాటలను బట్టే అర్థమవుతోంది.