posted on Jul 24, 2024 9:30AM
ఆర్థిక సమస్యలు మనిషిని మానసిక ఒత్తిడికి లోను చేస్తాయని తెలుసు. కానీ మానసిక ఒత్తిడి మరిన్ని ఆర్థిక సమస్యలకి దారితీస్తుందనీ… ఇదొక విషవలయం అనీ ఎప్పుడన్నా అనిపించిందా! ఈ విషయంలోని నిజానిజాలను తెలుసుకునేందుకు బ్రిటన్‌కు చెందిన ‘Money and Mental Health Policy Institute’ ఒక పరిశోధనను నిర్వహించింది. ఇందులో భాగంగా 5,500 మంది అభిప్రాయాలను సేకరించింది.
మానసికమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారి ఆర్థిక జీవితం ఏమంత సజావుగా సాగడం లేదని ఈ పరిశోధన నిరూపించింది. విచ్చలవిడిగా ఖర్చుపెట్టేయడం, అవసరం లేకున్నా అప్పులు తీసుకోవడం, ఆదాయాన్ని కాపాడుకోలేకపోవడం… ఇలా డబ్బు మీద నియంత్రణని కోల్పోతున్నారని తేలింది. చాలా తక్కువ ఆదాయం కలిగినవారు కూడా ఇలా ఆర్థిక నియంత్రణను కోల్పోవడం ఆశ్చర్యకరం! ఈ సంస్థ నివేదిక ప్రకారం, మానసిక ఒత్తిడిలో ఉన్నవారిలో…
– 93 శాతం మంది తాము అవసరానికి మించి ఖర్చుపెడుతున్నామని ఒప్పుకున్నారు.
– 92 శాతం మంది తాము ఆర్థిక నిర్ణయాలను తీసుకోలేకపోతున్నామని తేల్చిచెప్పారు.
– 59 శాతం, తమకి అవసరం లేకపోయినా కూడా అప్పులు తీసుకుంటున్నామని తెగ బాధపడిపోయారు.
అవసరం లేకపోయినా అప్పులు తీసుకోవడమే కాదు… ఆ రుణాలకి సంబంధించిన నిబంధనలను అర్థం చేసేకోకుండానే రుణ ఒప్పందాలు పూర్తిచేశామని 24 శాతం మంది వాపోయారు. మరో 38 శాతం మంది ఆ అప్పు తీసుకునే సమయంలో తనకి ఏం చెప్పారో కూడా గుర్తులేదని చెప్పుకొచ్చారు. అనవసరంగా అప్పులకు దిగడం మాట అటుంచి, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏకంగా 38 శాతం మంది ఉద్యోగాన్ని కోల్పోయారని తేలింది. ఇలా ఆర్థిక నియంత్రణను కోల్పోవడం వల్ల ఇతరత్రా సమస్యలు కూడా చాలానే బయటపడ్డాయి. అప్పటిదాకా పొదుపు చేసుకున్న సొమ్మంతా ఆవిరైపోవడం, ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం, ఆర్థిక సంబంధాలను చెడగొట్టుకోవడం… వంటి దీర్ఘకాలిక నష్టాలతో జీవితం కునారిల్లిపోతుందిట.
పైన పేర్కొన్న కారణాలన్నింటివల్లా… మానసికమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు పరిశోధకులు. మనసులో ఉన్న అలజడి ఉపశమించేందుకో, సమాజంలో విలువను పెంచుకునేందుకో, అలవాటుగానో, నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లనో… ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టించే మానసిక స్థితిని గమనించుకోమని సూచిస్తున్నారు. మరోవైపు అటు వైద్యులు కానీ, ఇటు ఆర్థికరంగ సలహాదారులుకానీ తమ దగ్గరికి వచ్చేవారిలో మానసిక ఒత్తిడిని గమనించడమూ… వారి ఆర్థిక స్థితి మీద ఆ ఒత్తిడి ప్రభావం కలుగకుండా తగు హెచ్చరికలు చేయడమూ ఉండాలి.
– నిర్జర.