టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే అద్భుతమైన సినిమాలు తీసి కమర్షియల్‌గా మంచి హిట్లు సాధించింది తెలుగు సినిమా. అంతేకాకుండా అప్పట్లో సినిమా బడ్జెట్‌గానీ, హీరోల రెమ్యునరేషన్లుగానీ నిర్మాత కంట్రోల్‌లోనే ఉండేవి. దాంతో నిర్మాతకు మంచి విలువ వుండేది. ఎప్పుడైతే హీరోల ఇమేజ్‌కి తగ్గట్టుగా సినిమాలు తియ్యడం మొదలు పెట్టారో, టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందిందో అప్పుడే బడ్జెట్ సమస్యలు వస్తున్నాయి. సినిమాకి హీరో, డైరెక్టర్ ప్రధానం అనే ముద్ర పడిపోయిన తర్వాత నిర్మాత అనే పాత్ర వెనక్కు వెళ్లిపోయింది. కాంబినేషన్ అనేది ముందుకు వచ్చింది. అప్పటి నుంచి నిర్మాత కేవలం డబ్బు పంపిణీ చేయడానికి మాత్రమే అనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడిరది. ఆ కారణంగా సినిమా, సినిమాకీ బడ్జెట్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే హీరోల రెమ్యునరేషన్లు కూడా భారీగా పెరిగిపోయాయి. కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెడితే రిటర్న్స్ బాగా వస్తాయనే నమ్మకం హీరోల్లో, దర్శకుల్లో బాగా పెరిగిపోయింది.
ఒకప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావుతోపాటు మరికొంత మంది దర్శకులు లో బడ్జెట్‌లో సినిమాలు తీసి సూపర్‌హిట్స్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. నిర్మాతల విషయంలో, బడ్జెట్ విషయంలో జరుగుతున్న మార్పుల గురించి, వాటి వల్ల జరిగే అనర్థాల గురించి పలు వేదికలపై ఎన్నోసార్లు తన ఆవేదన వ్యక్తం చేశారు దాసరి. సినిమాకి అవసరం ఉన్నా, లేకపోయినా బడ్జెట్ పెంచేస్తున్నారని, అది నిర్మాతకు శ్రేయస్కరం కాదని పలుమార్లు సినీ పరిశ్రమను హెచ్చరించారు. కానీ, మన హీరోలు, దర్శకులు మాత్రం తమ ధోరణిని మార్చుకునే ప్రయత్నం చెయ్యలేదు. తాజాగా టాలీవుడ్‌లోని ఓ అగ్ర నిర్మాత ఇదే ఆవేదనను వ్యక్తం చేశారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా మలయాళంలో రూపొందిన ‘ది గోట్ లైఫ్’ చిత్రం తెలుగు వెర్షన్‌ను మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మార్చి 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో మైత్రి అధినేతల్లో ఒకరైన రవిశంకర్ మలయాళ పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనం 50 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే, మలయాళ నిర్మాతలు అదే సినిమాను, అదే క్వాలిటీతో 25 కోట్లలో తీస్తున్నారు. మన దగ్గర అంత బడ్జెట్ ఎందుకు అవుతోందో అర్థం కావడం లేదు. ‘ది గోట్ లైఫ్’ చిత్రాన్నే తీసుకుంటే దీనికి 80 కోట్లు ఖర్చయింది. అయితే ఇది 100 కోట్ల సినిమాలా కనిపిస్తుంది. టెక్నికల్‌గా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది. లొకేషన్లుగానీ, సౌండ్ మిక్సింగ్‌గానీ అద్భుతంగా కుదిరాయి. విజువల్‌గా ఎంతో గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు బ్లెస్సీ 16 ఏళ్ళు కష్టపడి రూపొందించాడు. అతని కోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
టాలీవుడ్‌లో టాప్ హీరోలతో సినిమాలు ఎక్కువగా నిర్మించే మైత్రి మూవీ మేకర్స్ అధినేత ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరిస్టులుగానీ, టెక్నీషియన్స్‌గానీ వారి రెమ్యునరేషన్స్‌ను కావాలనే హైప్ చేస్తున్నారనే ధోరణి అతని మాటల్లో తెలుస్తోంది. ఈమధ్యకాలంలో సినిమాల బడ్జెట్ గురించి ఏ నిర్మాతా వేదికలపై ప్రస్తావించలేదు. ఇప్పుడు రవిశంకర్ ఆ విషయాన్ని ప్రస్తావించడం, మలయాళ ఇండస్ట్రీ ఈ విషయంలో హెల్దీగా ఉందని చెప్పడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.