సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంత పెరిగిందో మనందరికీ తెలిసిందే. ఈమధ్యకాలంలో హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. వారే కాదు, వారి పిల్లలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. వారిలో సూపర్‌స్టార్ మహేష్ కుమార్తె సితార గురించి చెప్పుకోవాలి. రకరకాల వెకేషన్స్‌లో సోషల్ మీడియాలో సందడి చేసే సితార అప్పుడప్పుడు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం మనం చూస్తున్నాం.
ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్‌స్టార్ మహేష్ ‘గుంటూరు కారం’ మంచి కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది సితార. చీర్స్ ఫౌండేషన్‌కు చెందిన అనాధ పిల్లల కోసం మహేష్‌బాబు ఫౌండేషన్ ద్వారా ‘గుంటూరు కారం’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సితార హోస్ట్‌గా వ్యవహరించింది. ఫౌండేషన్‌కు చెందిన అనాధ పిల్లలతో కలిసి ‘గుంటూరు కారం’ చిత్రాన్ని వీక్షించింది. షో అనంతరం సినిమాపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనాధ పిల్లలకు సినిమా చూపించాలన్న ఆలోచన రావడం, వారితో కలిసి సినిమా చూడడం అనేది చాలా గొప్ప విషయమని నెటిజన్లు సితారను ప్రశంసిస్తున్నారు. ఇంతకుముందు తన పుట్టినరోజు సందర్భంగా కొంతమంది పిల్లలకు సైకిళ్ళు అందజేసిన విషయం తెలిసిందే. ఏదో ఒక సందర్భంలో తన సేవా గుణాన్ని చాటుకుంటున్న సితారను అందరూ అభినందిస్తున్నారు.