కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో వర్షాల వల్ల జరిగిన బీభత్సం గురించి అందరికీ తెలిసిందే. తెల్లవారే లోపు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది ఆచూకీ లభించలేదు. ఇప్పటివరకు దేశంలో జరిగిన విపత్తుల్లో వాయనాడ్ ఘటనే అతి పెద్దదిగా చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా అందరి కంటే ముందుగా స్పందించేది సినీ పరిశ్రమే. ఈ వరదల కారణంగా నష్టపోయిన వారికి, నిరాశ్రయులైన వారికి అండగా నిలిచేందుకు సినీ పరిశ్రమ మరోసారి ముందుకొచ్చింది.
కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తమ విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య, జ్యోతిక, రష్మిక, నయనతార, ఫహద్ ఫాజిల్ లక్షల రూపాయల విరాళాలను ప్రకటించారు. అలాగే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ రూ.25 లక్షలు, చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి రూ.1 కోటి రూపాయలను ప్రకటించారు. తాజాగా ప్రభాస్ రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఇలాంటి విషయాల్లో అందరి కంటే ఎక్కువగా స్పందించే ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.