జగనన్న సైన్యం
2019 ఎన్నికల్లో విజయంతో అధికారం చేపట్టిన వైఎస్ జగన్… గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, దానికి అనుబంధంగా గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకోచ్చారు. సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను నియమించారు. వాలంటీర్ల తన సైన్యమని జగన్ పదే పదే చెప్పారు. సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చేందుకు వాలంటీర్లు పనిచేశారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. దీంతో అప్పటి ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేయడంతో వాలంటీర్లను ఎన్నికలకు దూరంపెట్టింది. దీంతో వాలంటీర్లతో రాజీనామాలు చేయించిన వైసీపీ నేతలు…వారితో తమ మద్దతుగా ప్రచారం చేయించారు. అయినా ఫలితంలేకపోయింది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యింది. ఇప్పుడు వాలంటీర్లు లబోదిబో మంటున్నారు. వైసీపీ నేతలు ఒత్తిడితో రాజీనామాలు చేశామని, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందా? లేదా? అనే సందిగ్ధం ఏర్పడింది. కొత్త వారిని వాలంటీర్లుగా తీసుకుంటారా? లేక పాత వారిలో కొంత మందికి అవకాశం కల్పిస్తారా? తెలియాల్సి ఉంది.