విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘గామి’ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. మార్చి 8న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.22 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. అయితే తమ సినిమాపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తాజాగా హీరో విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు అలాంటి వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించాడు.
టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’లో.. సినిమాలకు రేటింగ్, రివ్యూలు ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. అయితే కొందరు ‘గామి’ చిత్రానికి 10కి 1 రేటింగ్ ఇస్తూ.. చెత్త సినిమా అని కామెంట్ చేస్తున్నారు. ఇది హీరో విశ్వక్ సేన్ దృష్టికి వెళ్ళడంతో.. ఆయన కాస్త ఘాటుగానే స్పందించాడు. తాజాగా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశాడు.
“గామి సినిమా విజయానికి సహకరించిన ఒక్కరికీ ధన్యవాదాలు. నా దృష్టికి వచ్చిన ఒక సమస్య గురించి మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. మా సినిమా ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు బుక్ మై షో వంటి వేదికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా సినిమాకి జెన్యూన్ గా 10 కి 9 రేటింగ్ వచ్చింది. కానీ కొందరు బాట్స్ ద్వారా మా సినిమాకి 1 రేటింగ్ ఇస్తున్నారు. ఇలా ఎవరు చేస్తున్నారో నాకు తెలీదు.. కానీ నన్ను ఎంత కిందకు లాగాలని చూస్తే అంత పైకి లేస్తాను” అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.
ఆ మధ్య మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మూవీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. బుక్ మై షోలో బాట్స్ ద్వారా బ్యాడ్ రేటింగ్, రివ్యూలు ఇస్తూ తమ ‘గుంటూరు కారం’ సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అప్పుడు ఆ చిత్ర నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ‘గామి’ చిత్ర బృందానికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.