ఒక సినిమా నిర్మించడం కంటే రిలీజ్ చెయ్యడమే చాలా కష్టం. దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. రిలీజ్ డేట్ సమస్య కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఏదో ఒకటి చేసి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేస్తారు. ప్రస్తుతం ఓటీటీల హవా బాగా నడుస్తుండడంతో థియేటర్లలో సందడి ముగిసిపోయిన తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చెయ్యాల్సి ఉంటుంది. దాన్ని కూడా మేకర్స్ వాయిదా వేస్తున్నారంటే కారణం ఏమై ఉంటుంది.
‘హనుమాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి రెండు నెలలు దాటిపోయింది. వాస్తవానికి నెలరోజుల్లోనే ఓటీటీలోకి ఈ సినిమా రావాల్సి ఉంది. కానీ, ఏదో ఒక కారణంతో దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎన్నోసార్లు, ఎన్నో కారణాలు చెప్పాడు. ఓటీటీలో రిలీజ్ అయ్యే వెర్షన్ ఇంకా బెస్ట్ ఔట్‌పుట్‌తో ఉండాలన్నది మా ఆలోచన. దానికోసమే కష్టపడుతున్నాం. అందుకే ఓటీటీ ప్రేక్షకులకు నిరాశ ఎదురవుతోంది అని చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో రన్ కంప్లీట్ చేసుకుంది. అయినా ఇప్పటికీ ప్రశాంత్ అదే చెబుతున్నాడు. ఈపాటికి ఓటీటీలో రిలీజ్ అయిపోవాల్సిన ‘హనుమాన్’ మరోసారి నిరాశపరచింది. మహాశివరాత్రికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని చెప్పిన ప్రశాంత్ మళ్ళీ హ్యాండిచ్చాడు. పైగా ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని, దయచేసి అర్థం చేసుకొని ఓపిక వహించాలంటూ మళ్ళీ అదే డైలాగ్ చెప్పాడు. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు అదే మాట చెప్పాడు, రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ డైలాగ్‌ను వదలట్లేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈసారి వాయిదా వెయ్యాల్సి వస్తే కనీసం ఆ డైలాగ్ అయినా మార్చమని కామెంట్ చేస్తున్నారు. సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వెయ్యడం వెనుక మరో కారణం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్‌కు కొన్ని కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నారు మేకర్స్. ఆ విషయంలో కొన్ని సమస్యలు రావడంతో ఏం చెయ్యాలో తోచని స్థితిలో దర్శకనిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది.