posted on Jun 8, 2024 10:50AM
పండ్ల రారాజు మామిడి గురించి ఎంత చెప్పినా తక్కువే. రుచిలోనూ, ఆరోగ్యాన్ని చేకూర్చడంలోనూ మామిడికి తిరుగులేదు. అయితే అందరూ మామిడి కాయను తిని అందులో ఉండే విత్తనాలు పడేస్తుంటారు. అయితే మామిడి కాయతోనే కాదండోయ్.. మామిడి విత్తనాలు తిన్నా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయట. ఇంతకీ మామిడి విత్తనాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో.. వీటిని ఆహారంలో ఎలా తీసుకోవచ్చో తెలుసుకుంటే..
ప్రయోజనాలు..
మామిడి గింజలు ఫినోలిక్ సమ్మేళనాలుగా పిలువబడే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి కూడా దోహదం చేస్తాయి.
మామిడి గింజలలో విటమిన్ సి తో పాటూ ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి బలమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. ఆహారంలో మామిడి గింజలను చేర్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌లను దూరం చేయడంలో, ముఖ్యంగా ఫ్లూ సీజన్‌లో అనారోగ్యాలను దూరం చేసుకోవడంలో సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఫైబర్ చాలా అవసరం. మామిడి గింజలలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మామిడి గింజలను తీసుకోవడం వల్ల సాధారణ ప్రేగు కదలికలు మెరుగవుతాయి. మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఇది మొత్తం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
మామిడి గింజలలో ఉండే సమ్మేళనాలు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆహారంలో మామిడి గింజలను చేర్చడం ద్వారా, మీరు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను మెయింటైన్ చేయవచ్చు. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ మామిడి గింజలు బరువు నిర్వహణలో సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఎక్కువ కాలం కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. అతిగా తినే పరిస్థితిని తగ్గిస్తుంది. అంతేకాదు ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటాయి.
ఎలా తినవచ్చంటే..
మామిడి గింజలను స్మూతీస్ లోనూ, రోస్ట్ లలోనూ, స్నాక్స్ లలోనూ తీసుకోవచ్చు. అంతేకాదు మామిడి గింజలను ఉడికించి టీలా కూడా తీసుకోవచ్చు. మామిడి గింజలను పొడి చేసి వాటిని రోటీలు, కేకులు, బ్రెడ్ వంటి వాటి తయారీలోనూ వినియోగించవచ్చు. కూరలు చిక్కదనం రావడానికి. సూపుల చిక్కదనం కోసం కూడా మామిడి గింజలను ఉపయోగించవచ్చు. మరొక విషయం ఏమిటంటే.. మామిడి గింజలలో బయోటిన్ సమృద్దిగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా గొప్పగా సహాయపడుతుంది.
*రూపశ్రీ.