కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది. దీనిపైన అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. మోడీని పెద్దన్న అని గౌరవించినా నిధులు ఇవ్వలేదన్నారు. తాను మూడుసార్లు వెళ్లి మోడీని కలిశానని, మంత్రులు పద్దెనిమిదిసార్లు వెళ్లారని అయినా ప్రయోజనం కలగలేదని రేవంత్ రెడ్డి ఆగ్రహించాడు.
ఇందుకు నిరసనగా గతంలో కేసీఆర్ నడిచిన బాటలోనే వెళ్లాలని రేవంత్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ నిరసన ఏమిటంటే …ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకూడదని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంటే ఆ సమావేశాన్ని సీఎం బహిష్కరిస్తున్నాడన్న మాట. పంజాబ్, తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
కానీ మోడీని తీవ్రంగా వ్యతిరేకించే ఫైర్ బ్రాండ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం తాను నీతి ఆయోగ్ సమావేశానికి వెళతానని, అక్కడే మోడీకి తీవ్ర నిరసన తెలియచేస్తానని ప్రకటించింది. అంటే ఆ సమావేశంలోనే మోడీని కడిగిపారేస్తానని అనే అర్థంలో చెప్పింది. రేపే సమావేశం కాబట్టి ఆమె ఈరోజు బయలుదేరి వెళ్ళింది.
తనను నిరసన వ్యక్తం చేయడానికి అనుమతించకపోతే అనే మాటలేవో మొహం మీద అనేసి బయటకు వచ్చేస్తానని చెప్పింది. బడ్జెట్ లో తమ రాష్ట్రానికి కూడా నిధులు ఇవ్వకుండా అన్యాయం చేశారని చెప్పింది. బెంగాల్ ను విడగొట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నారని ఆరోపించింది. నిధులు ఇవ్వనందుకు మోడీకి నిరసన తెలుపవచ్చు. తప్పులేదు.
కానీ సమావేశానికి అటెండ్ అయి నిరసన తెలపడం సరైన పధ్ధతి . ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తోంది ఆ పనే. రేవంత్ కూడా అలాగే చేసి ఉండాల్సింది. సమావేశాన్ని బహిష్కరించినంత మాత్రాన ఆయన నిరసన బలంగా తెలిపినట్లు కాదు. అందుకే నేరుగా నిరసన తెలియచేయడమే మంచిది.