టాలీవుడ్‌లో యాంకర్ సుమకు ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. చిన్న ఈవెంట్ అయినా, పెద్ద ఈవెంట్ అయినా నొప్పించక.. తానొవ్వక అనే పద్ధతిలో చాలా బ్యాలెన్స్‌డ్‌గా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు శభాష్ అనిపించుకోవడం ఆమె ప్రత్యేకత. సినిమాని తన యాంకరింగ్ ద్వారా ప్రమోట్ చెయ్యడమే కాదు, మధ్య మధ్యలో ఛలోక్తులు విసురుతూ ఈవెంట్‌ని సందడి చేస్తూ ముగించడం ఆమెకు మొదటి నుంచీ అలవాటు. అలాంటిది ఆమె నిర్వహించిన కార్యక్రమంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. సరదాగా అంటున్నాను అనుకొని ఒక మాట మీడియాను ఉద్దేశించి అనడం, దానికి మీడియా నొచ్చుకోవడంతో ఈవెంట్ కాసేపు అప్‌సెట్ అయ్యింది. ఆ తర్వాత స్టేజి మీదే మీడియా వారికి సారీ చెప్పింది. ఈవెంట్ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ఒక వీడియోను చేసి మీడియాకు స్వయంగా సారీ చెప్పింది. సుమ యాంకరింగ్‌లో ఎప్పుడూ జరగని తప్పిదం ఈ కార్యక్రమంలో ఎందుకు జరిగింది, ఆమె సారీ చెప్పేంతగా ఆమె మీడియా గురించి ఏం మాట్లాడిరది అనేది ఒకసారి పరిశీలిస్తే..
వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ‘ఆదికేశవ’ చిత్రానికి సంబంధించిన సాంగ్ లాంచ్ కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. అందులో భాగంగా సుమ తన యాంకరింగ్ స్టార్ట్ చేస్తూ ‘బయట స్నాక్స్‌ని భోజనంలా చేస్తున్న వారు లోపలికి వచ్చి కెమెరాలు పెడితే బాగుంటుంది’ అనే ధోరణిలో ఆమె వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఇది మీడియా వారిని బాధించే అంశమే. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మీడియాతో కలిసిపోయి, అందర్నీ స్నేహితుల్లా భావించే సుమ ఈ తరహా వ్యాఖ్యలు చేసిందంటే ఎవరూ నమ్మలేరు. కానీ, అది జరిగింది. ఇదే విషయాన్ని ఒక జర్నలిస్ట్ ఆమెతో ప్రస్తావించాడు. మీడియాను ఉద్దేశించి అలాంటి కామెంట్స్ చేయడం సరికాదని చెప్పాడు. దీనికి వెంటనే స్పందించిన సుమ వేదికపై నుంచే మీడియాకు సారీ చెప్పి కార్యక్రమాన్ని కొనసాగించింది.
కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా మరో వీడియో చేసి మీడియాకు రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ ‘మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. దానికి నిండు మనసుతో క్షమాపణ కోరుకుంటున్నాను. మీరందరూ ఎంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి గత కొన్ని సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాం. కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.