దిశ, ఫీచర్స్ : ఇతరులకు మంచి చేయాలని భావించడంలో ఏమాత్రం తప్పులేదు. మర్యాదగా, దయగా మసలు కోవడం నిజానికి అభినందించ దగిన విషయమే. కానీ మీ మంచితనం, దాని తాలూకు ప్రవర్తన సందర్భోచితంగా లేకుంటేనో, అవతలి వ్యక్తిని అర్థం చేసుకోకుండా ‘మంచి’ చేయాలని ప్రయత్నిస్తేనో మాత్రం బెడిసి కొడుతుంది. మంచి తనం అవసరమే కానీ.. ఎదుటి వారికి విసుగు తెప్పించే స్థాయిలో అది ఉండకూడదని నిపుణులు చెప్తున్నారు. అలాంటి ఇబ్బందికరమైన ‘మంచి’పనులేవో చూద్దాం.
అభిప్రాయానికి భిన్నంగా..
అవతలి వ్యక్తి మీకు ఫ్రెండ్, కొలీగ్, బాగా తెలిసిన వ్యక్తి.. ఇలా ఎవరైనా కావచ్చు. వారితో మీకున్న అనుబంధం, చొరవ గొప్పవే కావచ్చు. అలాగనీ ప్రతి విషయంలోనూ వారి అభిప్రాయాన్ని పరిగణించకుండా మీకు మీరే డిసైడ్ అయ్యి ప్రవర్తించడం, మంచి చేయాలని భావించడం మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీరు చేసే ‘మంచి’పట్ల అవతలి వ్యక్తి అభిప్రాయం భిన్నంగా ఉండవచ్చు. మీరు ఏదైతే మంచిది అనుకుంటున్నారో అవతలి వ్యక్తి దృష్టిలో అది మంచిది కాకపోవచ్చు. కాబట్టి ‘మంచి’పని పేరుతో మీకు నచ్చిన పని చేస్తూ అవతలి వారి దృష్టిలో చులకన కావద్దు.
కాంప్లిమెంట్ ఇవ్వడం
కాంప్లిమెంట్ అప్పుడప్పుడూ మంచిదే. కానీ ప్రతీ విషయంలోనూ కాంప్లిమెంట్ ఇస్తూ పోతే కూడా అవతలి వ్యక్తులకు విసుగు తెప్పిస్తుంది. ముఖ్యంగా కొన్ని విషయాల్లో అలా చేయడం ఎదుటి వ్యక్తి లోపాలను గుర్తు చేయడమో, అసౌకర్యానికి గురిచేయడమో అవుతుంది. మీకు తెలిసిన వ్యక్తి అధిక బరువు లేదా లావుగా ఉన్నారనుకోండి. అప్పుడు మీ మంచితనం ప్రదర్శించుకోవడానికి నలుగురిలో వారిని ‘బొద్దుగా.. ముద్దుగా ఉన్నారు’ అని పొగిడేస్తారు. కానీ ఇది అవతలి వ్యక్తికి నచ్చకపోవచ్చు. పైగా వారి మనసును గాయపరుస్తుంది. ఇక్కడ మీరు చేయాలనుకున్న మంచి పని బెడిసి కొట్టినట్టే.
సహజ స్వభావాన్ని ఎత్తి చూపడం
నలుగురిలో ఉన్నప్పుడు మీరు అందరితో మాట్లాడుతుంటారు. మీకు తెలిసిన మరో వ్యక్తి నిశ్శబ్దంగా కూర్చున్నారనుకోండి. ఆ సమయంలో మీరు వారిని అర్థం చేసుకోవాలి కానీ, మీ మంచితనం లేదా చమత్కారం ప్రదర్శించాలని చూస్తారు. ఎందుకు ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటారు? మీరు ఎప్పుడూ అంతే.. అని లేబుల్ చేస్తారు. కానీ అవతలి వ్యక్తికి ఈ మాటలు అసౌకర్యానికి గురిచేస్తాయి. వారి నేచురల్ స్వభావాన్ని కించపర్చినట్లు అవుతుంది.
‘నో’ చెప్పినా బలవంతం చేయడం
మీరు ఇది ఎక్కడో ఒక దగ్గర గమనించే ఉంటారు. స్నేహితులతోనో, తెలిసిన వ్యక్తులతోనో కలిసి భోజనం చేస్తుంటారు. అందులో ఒకరు మర్యాద కోసమో, మంచి కోసమో ‘ఇంకా పెట్టుకోండి, ఇంకా తాగండి’ అని ఆహారం, పానీయాల విషయంలో బలవంతం చేస్తుంటారు. ఇది ఓ లిమిట్ వరకు మర్యాదగా ఉంటుంది. కానీ నచ్చనప్పుడు పదే పదే నో చెప్పినా బలవంతం చేయడం వాస్తవానికి మంచితనం కాదు. ఇది అనేక విషయాల్లో వర్తిస్తుంది. ఒకరిని బలవంతం చేయడం బ్యాడ్ హాబిట్.
సందర్భోచితం కాని సానుభూతి
సానుభూతి ప్రదర్శించడం మంచిదే కానీ ఎల్లప్పుడూ మంచిది కాదు. ఉదాహరణకు అవతలి వ్యక్తి చదువుతున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ఇయర్‌ఫోన్ పెట్టుకొని ఒంటరిగా కూర్చున్నప్పుడు నిజానికి వారు ఏకాంతం కోరుకొని ఉండవచ్చు. ఈ సందర్భంలో అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవాలి. అవసరం అయితే ఒకసారి అడిగి చూడాలి. కానీ అదేది చేయకుండా ఎదుటి వ్యక్తికి బోర్ కొట్టిందని మీకు మీరే అనుకుంటారు. ఉద్దేశ పూర్వకంగా చొరవ ప్రదర్శిస్తారు. ఒంటరిగా ఉన్నందుకు ఏమీ తోచట్లేదేమో అంటూ వారి ఏకాంతానికి భంగం కలిగిస్తారు. ఒంటరిగా ఉన్నంత మాత్రాన అవతలి వ్యక్తులు ఇతరుల సానుభూతి, సాంగత్యం కోరుకుంటారని అనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు.