అన్ని దశలను దాటిన తరువాతనే ఆధ్యాత్మికం వస్తుంది. వేదాంతంతో జీవితానికి ఆది నుంచి అంతం ఏమిటో తెలుస్తుంది. బిజీ జీవితంలో ఉన్న వారు ఆ వైపు తొంగి చూడలేరు. ఇహం మీద మోజు పెరిగి అహం పెంచుకున్న వారు పరం వైపుగా అడుగులు వేయలేరు. అటువంటి అదృష్టం కొందరికే వస్తుంది. స్వామీజీలు ఆ కోవలోకి చెందినవారే. వారికి ఇహాలూ భేషజాలు అన్నవి అసలు ఉండకూడదు. లౌకిక ప్రపంచంతో వారికి ఏ మాత్రం సంబంధం ఉండకూడదు.
కానీ స్వాములు చాలా మంది మాత్రం మఠాలు పీఠాలు అంటూ గడుపుతున్నారు. అక్కడికి వచ్చిన రాజకీయ నేతలను కలుస్తున్నారు. చివరికి ఈ రాజకీయ రొచ్చు వారికి కూడా అంటుకుంటుంది. అది ఆధ్యాత్మిక తత్వం పట్ల ఆసక్తి ఉన్న ఆస్తిక జనులకు కూడా ఇబ్బందిగా ఉంటోంది. అయితే అన్నీ పూర్తి అయ్యాక ఇక చాలు ఇవన్నీ అని వైరాగ్యం పెంచుకోవడం వేరు. వేదాంతంలో మునిగితేలుతూ ఉండే స్వామీజీలు ఇక చాలు మళ్లీ ముక్కు మూసుకుంటాను అని అనడం వేరు.
విశాఖ శ్రీ శారదాపీఠం స్వామీజీ ఇపుడు అదే అంటున్నారు. ఆయన రాజకీయంగా వైసీపీకి అనుకూలమని ప్రచారం జరిగింది. దానికి తగినట్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భీమిలీలో ఆయనకు కేటాయించిన పదిహేను ఎకరాల భూముల జీవో రద్దు చేశారు. తిరుపతిలో కూడా శారదాపీఠం కట్టిన భవనాలను కూల్చాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇలా రాజకీయ సెగ ఎడా పెడా పీఠానికి తగిలింది. ఏపీలో ఉండలేక తెలంగాణకు వెళ్లాలని స్వామి అనుకున్నట్లుగా ప్రచారం సాగింది. అయితే తాను తెలుగు రాష్ట్రాలను విడిచి వెళ్తున్నట్లుగా శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తాజాగా ప్రకటించారు.
తాను ఇక మీదట రుషికేశ్ లో తపస్సు చేసుకుంటూ అక్కడే ఎక్కువ సమయం గడుపుతాను అని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. అందువల్ల తన్నకు ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కల్పిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను వెనక్కి తీసుకోవాలని పీఠం తరఫున డీజీపీకి లేఖ రాశారు. అదే విధంగా విశాఖ పోలీస్ కమిషనర్ కి లేఖ రాశారు.
తనకు ఇప్పటి దాకా భద్రత కల్పించిన వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. ఇక మీదట విశాఖ పీఠాధిపతి రుషికేశ్ లో ఉంటారన్న మాట. ఆయన ఉత్తరాదిన ఆధ్యాత్మిక భావనలో పూర్తి కాలం గడుపుతారు అని అంటున్నారు. స్వాములకు కావాల్సింది అదే. అందుకోసమే శారదా పీఠాధిపతి కూడా ఇపుడు పూర్తిగా ముక్కు మూసుకుని తపస్సులోనే ఉంటారని పీఠం వర్గాలు చెబుతున్నాయి.