ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో ఘనంగా సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. భారతదేశ ప్రభుత్వం అందించే అత్యుత్తమ పురస్కారాల్లో రెండవ గొప్ప అవార్డుగా భావించే పద్మవిభూషణ్‌కు ఈ మధ్య చిరంజీవి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కానుండటం అనేది మరింత ప్రాముఖ్యతను తీసుకొస్తుంది. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతుండటం అనేది సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ఎలాంటి నిబద్ధను కలిగి ఉన్నారనే అంశాన్ని తెలియజేస్తోంది.
సాధారణంగా జరిగే ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను మించేలా ఈ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ ఉండనుంది. సినిమాల ప్రదర్శనలు, సినిమాలకు సంబంధించిన చర్చలు, ఔత్సాహిక నిర్మాతలను ప్రోత్సహించేలా ఇదొక ప్రత్యేకమైన వేదికగా నిలుస్తుంది. ప్రతిభావంతులు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి, అలాగే వారికి కావాల్సిన సినీ పరిశ్రమ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఈ వేడుక స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు చాలా సినీ ఉత్సవాలు జరిగాయి. అయితే అలాంటి సాంప్రదాయలకు భిన్నంగా చిత్ర పరిశ్రమలో ఎదగాలనుకుంటున్న ప్రతిభావంతులను మరింత విషయ సేకరణను చేసుకుని మరింతగా అభివృద్ధి చెందటానికి ఇదొక వేదికగా ఉపయోగపడనుంది.
సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ అనేది కేవలం సినిమాలకు సంబంధించిన వేడుకో, ప్రదర్శన ప్రాంతమో కాదు. ఇది మన వారసత్వాన్ని నేటి తరానికి తెలియజేసేది, మన సినీ సాంప్రదాయాన్ని అవగతం చేస్తుంది. ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో జరగబోతున్న ఈ సినీ వేడుక భారతీయ సినీ వారసత్వాన్ని మరింత వికసింప చేస్తుంది. మేకర్స్ కొత్త విషయాలను నేర్చుకోవటంలో దోహదపడుతుంది. ఈ కార్యక్రమం మార్చి 22వ తేదీన జరగనుంది.