ప్రస్తుతం రెండు భాగాల ట్రెండ్ నడుస్తోంది. పలు బడా సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కతున్నాయి. ఇప్పటికే ‘పుష్ప’ రెండో భాగం రూపొందుతోంది. అలాగే ‘సలార్’, ‘దేవర’ సినిమాలు రెండు భాగాలుగా రానున్నాయి. అయితే ఇప్పుడు ఈ లిస్టులో మరో సినిమా చేరినట్లు తెలుస్తోంది. అదే ‘గేమ్ ఛేంజర్’.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ‘ఇండియన్-2’ కారణంగా ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశముంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇదే ఇప్పుడు మెగా అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అసలే ఎప్పుడో మొదలైన ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యమవుతూ వస్తోంది. ఇక ఇప్పుడు రెండు భాగాలంటే మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఎంత ఆలస్యమైనా అవుట్ పుట్ మాత్రం అదిరిపోతుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట.