సోషల్ మీడియాలో కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. పిల్లలు, మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు. అలాంటి ఓ యూట్యూబర్ పై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి కోపమొచ్చింది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలను కోరాడు.
ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ తన ఫ్రెండ్స్ తో కలిసి లైవ్ లో మాట్లాడుతూ.. ఒక పసి పాప తన తండ్రితో ఉన్న వీడియోపై దారుణ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రణీత్ పై నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇక ఈ విషయం సాయి తేజ్ దృష్టికి కూడా వెళ్లడంతో ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించాడు. సోషల్ మీడియా ప్రమాదకరంగా తయారైందని.. మీ పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే విషయంలో కాస్త జాగ్రత్త వహించండి అని తల్లిదండ్రులకు సూచించాడు. అలాగే ట్విట్టర్ లో ఉన్న ఆ యూట్యూబర్ వీడియో క్లిప్ కి రిప్లై ఇస్తూ.. “ఫన్ పేరుతో చిన్నారులపై ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం. చిన్నారుల భద్రత గురించి ఆలోచించాలి. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి” అంటూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్ లను ట్యాగ్ చేశాడు.
సాయి తేజ్ తో పాటు నెటిజెన్లు కూడా గొంత కలుపుతున్నారు. ఆ యూట్యూబర్ అండ్ గ్యాంగ్ ఇలాంటి కామెంట్స్ మొదటిసారి కాదని.. ఎన్నో సార్లు ఇటువంటి కామెంట్స్ చేశారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.