దిశ, ఫీచర్స్ : నలుపు, తెలుపు వంటి శారీరక ఛాయను కలిగి ఉండటం పెద్ద సమస్యేమీ కాదు, పైగా ఇలా ఉండటం సహజం. దానివల్ల ఎవరూ ఎటువంటి ఇబ్బంది పడరు. కానీ శరీరమంతా ఒక కలర్‌లో ఉంటే కేవలం మెడపై మాత్రమే నల్లగా ఉండటం మాత్రం బాధితుల్లో కాస్త ఆందోళనకు గురిచేస్తుంది. రోజూ స్నానం చేసినా, రకరకాల సోపులు వాడినా పోవడం లేదని కొందరు బాధపడుతుంటారు. అయితే ఇలా మెడపై నల్లగా ఉండటాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, కొన్ని రకాల వ్యాధులవల్ల కూడా అలా జరగవచ్చని నిపుణులు చెప్తున్నారు.
ఇప్పటికీ కొన్ని వ్యాధులు వింతగానే అనిపిస్తాయి. వాటి సింప్టమ్స్ ఏమిటో గుర్తించలేకపోతాం. మెడపై నల్లగా మారడానికి కూడా అలాంటి కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా అకాంథోసిస్ నైగ్రికన్స్ అనే వ్యాధి వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. కాగా ఒబేసిటీ, డయాబెటిస్, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ వ్యాధులతో బాధపడేవారిలోనే ఈ నలుపు మెడ సమస్యలు ఎక్కువగా తలెత్తుంటాయి. ఎందుకంటే ఈ అనారోగ్యాలు కలిగిన వారిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సంభవిస్తుంది. ఫలితంగా మెడ భాగంలోని స్కిన్ లోపలి కణాల్లో పిగ్మెంటేషన్ ఏర్పడి, బయటి చర్మం నల్లగా మారుతుంది. ఎన్ని క్రీములు రాసినా, సోపులు వాడినా ఫలితం ఉండదు. పిగ్మెంటేషన్‌ను మార్చగలిగే చికిత్స ద్వారా మాత్రమే పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. అందుకే మెడపై నల్లగా ఉన్నవారు, ఈ సమస్య నుంచి బయటపడాలంటే డెర్మటాలజిస్టులను సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.