దిశ, ఫీచర్స్: సాధారణంగా కొంత మంది పిల్లలు మెల్ల కన్నుతో జన్మిస్తారు. అయితే కొన్ని జన్యు పరమైన లోపాల వల్ల అలా జరుగుతుంది. అయితే కొందరి పిల్లలకు పుట్టగానే దీనిని గుర్తించలేము. వారు పెరిగేకొద్ది మెల్లకన్ను బయటపడుతుంది. దీనిని వైద్య శాస్త్రంలో ఆంబ్లీయోపియా అని పిలుస్తుంటారు. అయితే మెల్లకన్ను రావడం వల్ల చాలా అదృష్టమని పెద్దలు చెబుతుంటారు. వారి జీవితంలో అనుకోని విధంగా శుభం జరుగుతుందని అంటుంటారు. కానీ మెల్లకన్ను ఉన్న పిల్లలను చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోకుంటే వారు పెరిగే కొద్ది కొన్ని సమస్యలు వస్తాయట. ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
లండన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు సమాచారం. ఇందులో భాగంగా 1, 26000 మందిని 40 నుంచి 60 వయస్సు ఉన్న వారిని ఎంపిక చేసుకుని పరిశోధనలు చేయగా 3 వేల మంది చిన్నప్పుడు మెల్లకన్నుతో బాధపడినట్లుగా వారు తెలుసుకున్నారు. అలాంటి వారిలోనే గుండె పోటు ప్రమాదం తో పాటుగా హైబీపీ, మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకలు తేల్చి చెప్పారు. అంతేకాకుండా 82 శాతం మంది పెద్దయ్యాక ఒక కంటి చూపును కూడా కోల్పోయినట్లు పరిశోధకులు వెల్లడించారు. అలాగే మెల్లకన్ను ఉన్న పిల్లలను చిన్నప్పటి నుంచే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కంటి చికిత్స చేయించడం అవసరమని చెబుతున్నారు.