నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు తమ అభిమాన కథానాయకుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచో మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై పలు రకాలైన వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. నందమూరి క్యాంప్ నుంచి మాత్రం మోక్షజ్ఞ ప్రస్తుతం ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనకు సంబంధించిన శిక్షణను తీసుకుంటున్నారని న్యూస్ వినిపిస్తోంది. అయితే పక్కాగా తన సినీ ప్రవేశం ఎప్పుడు ఉంటుందనేది ఎవరూ చెప్పటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భగవంత్ కేసరి ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘నేను దేని గురించి పెద్దగా ఆలోచించను. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా నాకు ఎలాంటి టెన్షన్ లేదు. తను ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో, తన మొదటి సినిమా ఏది ఉంటుందనేది తెలియదు. కానీ తన కోసం ఆదిత్య 999 స్టోరిని సిద్ధం చేశాను. ఓ రోజు రాత్రి పడుకుని నిద్ర లేవగానే వచ్చిన ఐడియాతో వెంటనే కథను సిద్ధం చేశాను. అలాగే తన కోసం మరో స్టోరీని కూడా సిద్ధం చేశాను’’ అని అన్నారు.
ఇదే సందర్భంలో ఆయన మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం వచ్చే ఏడాదిలో పక్కాగా ఉంటుదని చెప్పేశారు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాను డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుందని కూడా సమాచారం. మోక్షజ్ఞ నటనతో పాటు తన లుక్‌పై కూడా ఫోకస్ చేశాడు. బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యారు.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహా రెడ్డి, దసరాకు భగవంత్ కేసరితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తదుపరి బాబీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.