వైసీపీకి విశాఖకు మధ్య బంధం అందరికీ తెలిసిందే. విశాఖ మీద వైసీపీ అధినాయకత్వం మోజు పడింది. ఎవరూ కోరకుండానే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని చెప్పింది. విశాఖలో అప్పటికే ఉన్న హరిత రిసార్ట్స్ ని కూలగొట్టి రుషికొండ మీద అద్భుతమైన కట్టడాన్ని వందల కోట్లతో నిర్మించింది.
విశాఖ నుంచే పాలన అంటూ ఎన్ని సార్లు చెప్పారో కూడా వైసీపీ నేతలకే తెలియదు. ఇలా విశాఖ నామస్మరణం చేసినందుకు అయినా ఉనికి కోసం ఒక్క సీటు కూడా వైసీపీకి ప్రజలు ఇవ్వలేకపోయారు. మొత్తానికి మొత్తం సీట్లలో ఓడించి వైసీపీకి రాజకీయంగా పతనం ఏంటో చూపించారు. కొత్త ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా గట్టిగా కాలేదు కానీ విశాఖ నగరంలో వైసీపీ గతంలో ఎన్నడూ లేనంతగా బలహీనపడిపోయింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటములు ఏ పార్టీకి అయినా సహజం. అంతమాత్రం చేత పార్టీ నాయకులు క్యాడర్ ఉంటారు, వారు పార్టీ కోసం పోరాడుతారు. వైసీపీ తీరు చూస్తే అలా లేకుండా పోయింది. పార్టీ ఓడిన మరుక్షణం కూటమి వైపుగా పరుగులు తీస్తున్న నేతల తీరు కనిపిస్తోంది.
విశాఖ కార్పోరేషన్ ని వైసీపీ గెలుచుకుంది. ఇపుడు వైసీపీ కార్పోరేటర్లే తమ సొంత పార్టీని అక్కడ కూల్చేందుకు ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారు. అధికార పక్షం వైపు ఉంటూ తమకు కూడా అందులో అధికారం వాటా ఉండేలా చూసుకుంటున్నారు.
వైసీపీ ఇంత వేగంగా పతనం అవుతున్నా పట్టించుకునే నాధుడే పార్టీలో కనిపించడం లేదని అంటున్నారు. రెండేళ్ళ క్రితం పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ విశాఖ షటిల్ సర్వీస్ చేశారు. పార్టీలో వర్గ పోరుని గాలికి వదిలేశారు.
ఎన్నికల ముందు బలమైన నేతలు పోతున్నా ఎవరినీ ఆపే ప్రయత్నం చేయలేదు. ఇపుడు కూడా అదే తీరుగా ఉంది అని అంటున్నారు. పార్టీలో ఎవరూ పట్టించుకోక వైసీపీలోని ముఖ్య నాయకులు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే వైఖరి కొనసాగితే అతి తొందరలోనే వైసీపీ విశాఖలో రాజకీయంగా పెను సవాళ్ళు ఎదుర్కోవడం ఖాయమని అంటున్నారు.
The post మోజుపడ్డ నగరంలో దిగాలు పడిన వైసీపీ! appeared first on Great Andhra.