‘బాహుబలి’ ఫ్రాంచైజ్, ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమా స్థాయిని పెంచాడు దర్శధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli). ఆయన తదుపరి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే.. రాజమౌళి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాజమౌళి అనే పేరే పెద్ద బ్రాండ్. అందుకే దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రాజమౌళిపై ఏకంగా ఒక డాక్యుమెంటరీని రూపొందించింది.
‘మోడరన్ మాస్టర్స్’ (Modern Masters) పేరుతో రాజమౌళిపై ఒక డాక్యుమెంటరీని రూపొందించింది నెట్ ఫ్లిక్స్. ఇది ఆగస్టు 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఇండియన్ సినిమా, వరల్డ్ సినిమాపై రాజమౌళి ఎంతటి ప్రభావాన్ని చుపించారో చూపించనున్నారు. ఆయన సినీ ప్రయాణంతో పాటు.. ప్రధానంగా ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు పడిన పునాదులను, వాటి ప్రయాణాలను చూపించనున్నారని సమాచారం. అంతేకాదు ఈ డాక్యుమెంటరీలో ‘బాహుబలి’ ప్రధానపాత్రధారులు ప్రభాస్ (Prabhas), రానా (Rana), ‘ఆర్ఆర్ఆర్’ ప్రధానపాత్రధారులు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan).. రాజమౌళి గురించి మాట్లాడనున్నారని తెలుస్తోంది. అంతేకాదు హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరాన్, జోయ్ రుస్సో కూడా సందడి చేయనున్నారట. ఈ డాక్యుమెంటరీతో మరోసారి రాజమౌళి పేరు గ్లోబల్ స్థాయిలో మారుమోగిపోవడం ఖాయం.
కాగా, రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబు (Mahesh Babu)తో చేయనున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ అడ్వెంచర్ ఫిల్మ్ ని కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ.. ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.