దిశ, ఫీచర్స్ : లియోనార్డో డా విన్సీ తన జీవితంలో అనేక చిత్రాలను గీశాడు. వాటిలో 1503 లో ఆయన గీసిన మోనాలిసా చిత్రం మాత్రం ఏండ్లు గడిచినా ప్రజల్లో అలా ఉండిపోయింది. అసలు ఈ పెయింటింగ్ ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. లియోనార్డో చిత్రించిన మోనాలిసా పెయింటింగ్ ఎందుకు అంత ప్రజాదరణ పొందింది. దాని వెనుక ఉన్న ఉన్న ఆసక్తికరమైన కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1503 లో విశ్వ విఖ్యాతమైన “మొనాలిసా” పెయింటింగ్ మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఈ పెయింటింగ్ పూర్తి అయ్యాక ఆ చిత్రంలోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉండడం కనిపించింది. ఈ నవ్వు మాయాజాలం డావిన్సిని సైతం కట్టి పడేసింది. అలాగే ఈ నవ్వు మాయాజాలం లా పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది.
పెయింటింగ్‌కు మొదటి నుంచి కళారంగంలో మంచి గుర్తింపు ఉంది. 1860 లలో, కళా పండితులు దీనిని ఒక కళాఖండంగా పిలవడం ప్రారంభించారు. కానీ ఆ సమయంలో పెయింటింగ్ సాధారణ ప్రజల పై తన ముద్ర వేయలేదు. 1911లో మోనాలిసా చిత్రం దొంగతనం వార్త దావానంలా వ్యాపించడంతో పరిస్థితులు మారిపోయాయి.
రాత్రికి రాత్రే ఫేమస్ అయిన మోనాలిసా చిత్రం
మోనాలిసా పెయింటింగ్‌ను 1804లో ప్యారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో పెట్టారు. కానీ 19వ శతాబ్దం వరకు కూడా దీన్ని చూసేందుకు పెద్దగా జనం ఉండేవారు కాదు. ఈ పెయింటింగ్ విధి 1911 సంవత్సరంలో పూర్తిగా మారిపోయింది. నిజానికి, ఆగస్ట్ 21, 1911న, ఇటలీకి చెందిన కొందరు వ్యక్తులు లౌవ్రే మ్యూజియం నుండి పెయింటింగ్‌ను దొంగిలించారు. ఈ దొంగల్లో ఒకరు మ్యూజియంలోని ఉద్యోగి. లియోనార్డో డా విన్సీ ఇటలీ నుంచి వచ్చినందున ఈ పెయింటింగ్ ఇటాలియన్ వారసత్వం అని వారు విశ్వసించారు. వారు ఈ పెయింటింగ్‌ను తిరిగి ఇటలీకి తీసుకెళ్లాలనుకున్నారు. ఈ పెయింటింగ్ ను దొంగిలించిన తరువాత ఒక రోజంతా ఎవరూ గమనించలేదు. చోరీ వార్త తెలిసిన వెంటనే ఆ పెయింటింగ్ సామాన్యుల్లో చర్చనీయాంశంగా మారింది. మోనాలిసా పెయింటింగ్ దొంగతనం విశయం నలుమూలలా పాకింది. ఈ విషయంపై ఫ్రెంచ్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. పెయింటింగ్ గురించి వెతకడం ప్రారంభించారు. పెయింటింగ్‌ను గుర్తించిన వ్యక్తికి భారీ పారితోషికం ఇస్తామని కూడా ప్రకటించారు.
పెయింటింగ్ పెట్టిన ఖాళీ స్థలాన్ని చూడటానికి ప్రజలు మ్యూజియంలో గుమిగూడారు. ఆ సమయంలో మోనాలిసా పోస్ట్‌కార్డ్‌లు ప్రింట్ చేయడం ప్రారంభించాయి. కొంతమంది మోనాలిసా వంటి బొమ్మలను కూడా తయారు చేయడం ప్రారంభించారు. 2 సంవత్సరాల తర్వాత ‘మోనాలిసా’ చిత్రం దొరికినప్పుడు దాన్ని చూడటానికి లక్షల మంది ప్రజలు లౌవ్రే మ్యూజియంకు వచ్చారు. కేవలం మోనాలిసాను చూసేందుకు రెండు రోజుల్లో లక్ష మందికి పైగా ప్రజలు మ్యూజియంకు చేరుకున్నారు.
మోనాలిసా అమెరికా నుండి రష్యా పర్యటన..
ఈ మొత్తం సంఘటన ప్రజల మనసుల్లో మోనాలిసా ఇమేజ్‌ని సుస్థిరం చేసింది. ఈ మహిళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సుపరిచితమైంది. 1963లో మోనాలిసా ఫ్రాన్స్ నుండి అమెరికాకు ఏడు వారాల పాటు పర్యటనకు వెళ్లింది. అమెరికాలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఈ పెయింటింగ్‌ను చూడటానికి ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడారు . బీపీఎస్ నివేదిక ప్రకారం, 1974లో మోనాలిసాకు రష్యా, జపాన్‌లలో చిత్రలేఖనాన్ని ప్రదర్శనశాలలో ప్రదర్శించినప్పుడు అదే విధమైన ఆదరణ కనిపించింది.