ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి కన్హ శాంతి వనంలో జరిగిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగివస్తున్న సమయంలో.. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద మంగ్లీ కారును వెనకాల వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం స్వల్ప డ్యామేజ్ అయింది. మంగ్లీకి ఎటువంటి గాయాలు కాలేదు. అంతేకాదు ఆమె అదే కారులోనే ఇంటికి వెళ్ళిపోయింది.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటన ఆదివారం జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. అంతేకాదు ఈ ప్రమాదంలో మంగ్లీ గాయాలపాలైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మంగ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. రెండు రోజుల క్రితం మైనర్ యాక్సిడెంట్ జరిగిందని, తాను క్షేమంగా ఉన్నానని తెలిపింది. ఎటువంటి రూమర్స్ నమ్మొద్దని, మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని మంగ్లీ పేర్కొంది.