ఓవైపు రష్మిక, త్రిప్తి దిమ్రి, బాబీ డియోల్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్లు యానిమల్ సక్సెస్ తో పండగ చేసుకుంటుంటే.. అందులో హీరోగా నటించిన రణబీర్ కపూర్ మాత్రం రివర్స్ లో మాట్లాడాడు. ఇకపై యానిమల్ లాంటి సినిమా చేయననేది రణబీర్ సింగ్ స్టేట్ మెంట్. యానిమల్ పై వస్తున్న విమర్శలపై తొలిసారి స్పందించాడు
“పరిశ్రమకు చెందిన కొంతమందిని పలు సందర్భాల్లో నేను కలిశాను. యానిమల్ లాంటి సినిమా నువ్వు చేయకూడదన్నారు. ఆ సినిమా చూసి చాలా డిసప్పాయింట్ అయ్యామని చెప్పారు. అలా నాతో చాలామంది చెప్పారు. వాళ్లందరికీ నేను క్షమాపణలు చెప్పాను. మరోసారి అలాంటి సినిమా చేయనని వాళ్లతో అన్నాను.”
అయితే ఈ క్షమాపణలు, మరోసారి చేయననే హామీలు వాళ్లకు మాత్రమే పరిమితమన్నాడు రణబీర్. ఇప్పుడు తను ఉన్న స్టేజ్ లో వాళ్లతో వాదించడం కరెక్ట్ కాదని, క్షమాపణలు చెప్పి తప్పుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదని అన్నాడు. యానిమల్ పై జావెద్ అక్తర్ లాంటి పెద్దలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
సాధారణ ప్రేక్షకులకు యానిమల్ సినిమా ఎంతగానో నచ్చిందని, వాళ్లంతా తన కెరీర్ కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారని, అలాంటి సినిమా అవకాశం ఇంకోసారి వస్తే తప్పకుండా చేస్తానని అన్నాడు.
“చాలా ఏళ్లుగా అందరూ నన్ను ఫ్యూచర్ సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు. ఇంకెన్నాళ్లు అలా పిలుస్తారు. నేను మరో మెట్టు పైకెక్కాలి కదా. వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టాలి కదా. అప్పుడే నన్ను అంతా సూపర్ స్టార్ అంటారు. యానిమల్ సినిమా నా కెరీర్ లో కరెక్ట్ టైమ్ లో పడింది.”
తెరపై మంచివాడిగా కనిపించడం కోసం ఎన్నో సినిమాల్లో నటించానని, కానీ కెరీర్ లో నెక్ట్స్ స్టేజ్ కు వెళ్లాలంటే ఆ ఇమేజ్ సరిపోదన్నాడు రణబీర్. మంచి అబ్బాయి, లవర్ బాయ్ లాంటి ఇమేజెస్ నుంచి తప్పించుకోవడానికే యానిమల్ చేశానని స్పష్టం చేశారు.