ఈ సంక్రాంతి సీజన్ అంతా ‘హనుమాన్’ హవా కొనసాగుతోంది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధిస్తూ విజయపథంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసేసింది. ఈ సినిమాకు సెలబ్రిటీస్ సైతం ఫిదా అవుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారే కాకుండా ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా హనుమాన్ టీమ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే నటసింహ నందమూరి బాలకృష్ణ ‘హనుమాన్’ టీమ్‌ని ప్రశంసించారు. ఈ సినిమా స్పెషల్ షో వేయించుకొని మరీ చూశారు బాలకృష్ణ. అనంతరం సినిమాపై తన రివ్యూని తెలియజేశారు. సినిమా కన్నుల పండువలా ఉందని టీమ్‌ని అభినందించారు.
ఈ సినిమా కోసం నటీనటులు, టెక్నీషియన్స్ ప్రాణం పెట్టారని, అది స్క్రీన్‌పై కనిపిస్తోందని అన్నారు బాలయ్య. ఈ సినిమా తనకెంతో నచ్చిందని, ఇక హనుమాన్ 2 కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉంటే ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. హనుమాన్ చూసిన తర్వాత ప్రశాంత్‌వర్మ కాంబినేషన్‌లో తమ అభిమాన హీరో సినిమా చేస్తే బాగుంటుందని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.