Andhra Pradesh

రంగుల క‌ల‌ Great Andhra


జీవిత‌మ‌నే గాలి ప‌టానికి మాంజా వుండ‌దు. వున్నా నీ చేతిలో అస‌లు వుండ‌దు. త‌ప్పులు వెత‌క‌డంలో ప్ర‌తివాడి క‌ళ్లు భూత‌ద్దాలే. వాన అంటే సంగీత ధార‌. ప్ర‌తి చినుకూ ఒక ల‌య.

ల‌గేజీతో రాలేదు. ల‌గేజీతో వెళ్ల‌వు. కానీ జీవిత‌మంతా నీది కాని బ‌రువుని మోస్తూనే వుంటావు. క‌త్తి సాన పెట్టేట‌పుడు కురిసే అగ్ని వ‌ర్షం ఒక మృత్యు హెచ్చ‌రిక‌. ఆకాశంలో ఇంద్ర‌ధ‌న‌స్సు గీసిన‌వాడే పిడుగులు కూడా కురిపిస్తాడు.

రైలు మంచి కూత మీద వుంది. వంతెన‌పై గంతులేస్తూ వుంది. ఒక నిరుపేద రైల్వేస్టేష‌న్‌కి రోజుకి ఒక‌సారే సంద‌డి వ‌స్తుంది. పొట్ట‌నిండా మ‌నుషుల‌తో వెళుతున్న రైలు అడ‌విలోని కొండ చిలువ‌.

య‌వ్వ‌నం వున్నంత కాల‌మే ఎద్దు. ముస‌లిత‌నం వ‌స్తే అదొక క‌బేళా. రెక్క‌లొస్తే ఎగ‌రొచ్చ‌ని మ‌నుషుల క‌ల‌. నిజంగా రెక్క‌లుంటే , ఒక‌రి రెక్క‌లు ఇంకొక‌రు క‌త్తిరించుకోవ‌డంలో బిజీగా వుండేవాళ్లు.

రంగుల‌న్నీ క‌లిస్తేనే చిత్రం. ఏ రంగు ఎంత క‌ల‌పాలో చిత్ర‌కారుడి ఆత్మ‌. లోకం స‌ప్త‌వ‌ర్ణ‌మే కానీ మ‌నిషే ముదురు రంగు.

పెద్ద దొంగ‌ల‌కి గౌర‌వం, చిన్న దొంగ‌ల‌కి శిక్ష‌. శ‌తాబ్దాలుగా లోక‌నీతి. నువ్వు వేద పండితుడివే కావ‌చ్చు. వ‌ర‌దొచ్చిన‌పుడు ఈత తెలియ‌క‌పోతే వృథా.

జంతువుల దాహ‌మే మొస‌లికి ఆహారం. వ‌ల అందంగా వుంటే చేప ప‌డ‌దు. చిక్కంగా వుండాలి. ఉచిత ఆహారం కోరే ఎలుక బోనులో ప‌డుతుంది.

ఆకాశ‌మంత ఎదిగిన చెట్టుకి కూడా పునాది భూమే. నేల‌ని మ‌రిచిన వృక్షం కూలిపోతుంది. ఆర్కెస్ట్రా సిద్ధ‌మైంది, గాయ‌కుడే పాట మ‌రిచిపోయాడు. చేప‌కి జ‌ల‌స్తంభ‌న విద్య నేర్పించ‌డ‌మే రాజ‌కీయం.

డ‌బ్బులు విత్తి, డ‌బ్బుల పంట‌ని కోసుకోవ‌డ‌మే చ‌దువుల మ‌ర్మం. క‌త్తి ఒక‌టే, వైద్యుడు, సైనికుడు వేర్వేరు.

ఫిరంగి ధ్వ‌ని కంటే ఆప్తుల మౌనం భ‌యంక‌రం. నీటిని కోసుకుని వెళ్లినంత మాత్రానా న‌దిని ప‌డ‌వ జ‌యించ‌లేదు. గంగ‌కి కోప‌మొస్తే ప‌డవ‌ ఒక చంద్ర‌ముఖి.

ఈ ప్ర‌పంచం ఒక త్రీ డీ సినిమా చూడాలంటే ప్ర‌త్యేక అద్దాలు కావాలి. స‌హ‌జ నేత్రం మ‌స‌క‌బారి , చాలా కాల‌మైంది.

వెదురులోకి ప్రాణం వూదితే వేణువు. జీవ‌మైనా, గాన‌మైనా వాయువే. ఒక‌టి చెబితే అబ‌ద్ధం. వెయ్యి చెబితే సిద్ధాంతం.

నీ చేతి రేఖ‌ల్లో అదృష్టం లేదు. ఎదుటి డ్రైవ‌ర్ కాలికింద బ్రేకుల్లో వుంది. విత్తులోంచి వ‌చ్చే మొల‌క , రైతు కంటికి ప‌సిబిడ్డ‌.

లోప‌ల ఎన్ని స‌ముద్రాలున్నా , కంట్లోంచి వ‌చ్చేవి చిన్న నీటి చెల‌మ‌లే. వేదాంతుల‌కి కూడా ఆక‌లేస్తుంది. ఉప‌వాసం వుండేవాడికి వుప‌నిష‌త్తులు అర్థంకావు. అడ‌విలో ఉన్నా కోయిల పాడుతుంది. దానికి చ‌ప్ప‌ట్లు అక్క‌ర‌లేదు. స్వ‌ర‌మే జాతి చిహ్నం.

విజిల్ వేసినంత మాత్రాన కుక్క‌ర్ రైల్వేగార్డుగా మార‌దు. చెవితో వినేదంతా స‌త్యం కాదు. శుద్ధ స‌త్యాన్ని ప‌సిగ‌ట్టే చెవుల్ని దేవుడింకా త‌యారు చేయ‌లేదు.

జీఆర్ మ‌హ‌ర్షి



Source link

Related posts

Missing Girl: పవన్ ఆదేశాలతో పోలీసుల దర్యాప్తు,9 నెలల తర్వాత లభ్యమైన మైనర్ అచూకీ

Oknews

IRCTC Shirdi Tour : 4 రోజుల ‘షిర్డీ’ ట్రిప్

Oknews

మాజీ సిఎం జగన్‌, ఐపీఎస్‌లు పీవీ సునీల్, పిఎస్సార్‌లపై హత్యాయత్నం కేసు నమోదు, రఘురామ ఫిర్యాదు…-raghuramas complaint against custodial torture case registered against former cm jagan ips pv sunil psr ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment