స్టార్ హీరోలకు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందులోనూ రజినీకాంత్ లాంటి సూపర్‌స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ రజినీని చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు వేల సంఖ్యలో వస్తుంటారు. రజినీకాంత్ పుట్టినరోజు, పర్వదినాల్లో అభిమానుల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇది రజినీకి, అతని అభిమానులకు బాగానే ఉంటుంది. కానీ, ఇరుగు పొరుగు వారికి దీన్ని భరించే శక్తి, ఓపిక ఉండకపోవచ్చు. నిత్యం జరిగే ఈ తంతు వారికి చిరాకు పుట్టించవచ్చు. అలాంటి ఘటనే సంక్రాంతి రోజున చెన్నయ్‌లో జరిగింది.
రజినీని ప్రత్యక్షంగా చూసేందుకు చెన్నైలోని పోయెస్ గార్డ్‌లో సూపర్‌స్టార్ ఇంటి ముందు కొన్ని వేలమంది అభిమానులు బారులు తీరారు. ఎప్పటిలాగానే రజనీ బయటకు వచ్చి తనకోసం వచ్చిన అభిమానులను పలకరించారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తన అభిమానులంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అంత మంది అభిమానులు ఒక్కచోట చేరడంతో అక్కడ సందడి కాస్త ఎక్కువే అయింది. ఇది రజినీ పక్క ఇంటివారికి ఇబ్బంది కలిగించింది. రజినీ కనిపించగానే అభిమానులు ‘తలైవా.. తలైవా’ అంటూ కేరింతలు కొట్టారు. ఆ కేకలను భరించలేక పక్కింటిలో ఉన్న ఓ వృద్ధురాలు ‘ఇదేం లొల్లి.. మమ్మల్ని ప్రశాంతంగా పండగ జరుపుకోనివ్వరా’ అంటూ సీరియస్ అయ్యింది. ‘మీ ఇంటి తలుపులు తెరిచి వారిని లోనికి పిలిపించుకోవచ్చుగా. మేం కూడా ఇంటి పన్ను కడుతున్నాం. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా మా ఇంటి ముందు నిలబడి కేకలు వేసి ఇబ్బంది పెడుతున్నారు. ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కూడా వీలు లేకుండాపోయింది’ అంటూ ఫైర్ అయ్యింది. అప్పటివరకు సందడిగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ పెద్దావిడ సీరియస్‌గా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ఘటనపై రజినీకాంత్ స్పందన ఏమిటి అనేది తెలియరాలేదు.