తమకున్న నాయకులలో ఎవరు ఏ ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే విషయంలో పార్టీ అధినేతకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి కాలక్రమంలో ఆయా నాయకులు సాధిస్తున్న అనుభవాన్ని బట్టి, వారి తెలివితేటలు వారు ప్రజలతో మెలిగే తీరు, వారికి పెరుగుతున్న ఆదరణ తదితర అనేక అనేక అంశాలను అనుసరించి ఏ నాయకులు ఏ ఏ స్థానాలలో పోటీ చేస్తే బాగుంటుందో.. వారు ఏ ఏ పదవులలో కొలువుతీరి పని చేస్తే సమాజానికి ఉపయోగపడుతుందో.. పార్టీ అధినేతకు ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఈ అవగాహనను బట్టి అధినేత నిర్ణయాలు తీసుకుంటారు తమ నాయకులను పోటీకి బరిలో దించుతారు.
నిజానికి నాయకులు కేవలం తమ సొంత బలం మీదనే పోటీ చేసేటట్లయితే గనుక, వారిని నిర్దిష్టంగా ఒకే స్థానం నుంచి ఒకే రకమైన పదవికి మాత్రమే పోటీ చేయిస్తూ రావడం అధినేతకు తప్పదు. కానీ ప్రజల్లో బలం పార్టీది అయినప్పుడు.. నాయకులను వారి ప్రతిభలను బట్టి ఏ స్థానంలో ఏ పదవిలో అయినా వాడుకోగలరు ధైర్యం ఆ అధినేతకు చిక్కుతుంది.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని అదే. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా ఉన్న కొందరిని వచ్చే ఎన్నికలలో లోక్‌స‌భ‌కు పోటీ చేయిస్తారని, అలాగే ఎంపీలుగా పనిచేస్తున్న కొందరిని ఎమ్మెల్యేలు అందరిలోకి దించుతారని పార్టీలో ఒక ప్రచారం ఉంది. దీనితో పాటు ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను కూడా అటు ఇటుగా మార్చే అవకాశం ఉన్నదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి ఇలాంటి పరిస్థితి అపరిమితమైన బలం ఉండే పార్టీకి మాత్రమే సాధ్యం అవుతుంది. పూర్తిగా నాయకుల సొంత బలం మీద ఆధారపడి రాజకీయం చేసేవారు, ఇలాంటి మార్పు చేర్పులకు సాహసించలేరు.
జగన్మోహన్ రెడ్డి తనకున్న ప్రజాదరణ మీద, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వైఖరి మీద విశ్వాసం ఉన్నవారు గనుక, నాయకులను వారి వారి అర్హతలను తగ్గట్టుగా ఎవరిని ఎక్కడ వాడుకోవాలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలుగుతున్నారు.
అయితే ఇదంతా కూడా పార్టీలో పుడుతున్న భయం అన్నట్లుగా ఈనాడు దినపత్రిక దుష్ప్రచారానికి ఒడిగడుతోంది. విషపూరితమైన రాతలతో ప్రచారం చేస్తోంది. తప్పుడు కథనాలను ప్రచురించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. నీతిమాలిన ఇలాంటి ఈనాడు రాతలను ప్రజలు ఏవగించుకుంటున్నారు.