గత రెండు రోజులుగా తెలుగునాట ‘రాజధాని ఫైల్స్'(Rajadhani Files) మూవీ ట్రైలర్ గురించే చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 5న ఈ సినిమా ట్రైలర్ ‘తెలుగువన్’ యూట్యూబ్ ఛానల్ వేదికగా విడుదల కాగా, కేవలం 48 గంటల్లోనే 10 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. స్టార్ హీరోల సినిమాలను తలపించేలా ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ కి విశేష స్పందన లభిస్తుండటంతో పాటు, ఇది తమ సినిమా అంటూ ప్రజలు స్వచ్ఛందంగా భుజానికెత్తుకొని ప్రచారం చేస్తుండటంతో.. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ గుంటూరుతో పాటు ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకుంది. ట్రైలర్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుండటం, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలు పోటీ పడటం చూస్తుంటే.. ‘రాజధాని ఫైల్స్’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, పవన్, విశాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి.. సంగీత దర్శకుడు మణిశర్మ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వంటి దిగ్గజాలు పని చేయడం విశేషం.