Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. అనంతరం ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. 53 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై పలు కోర్టుల్లో విచారణ జరుగుతోంది. అయితే చంద్రబాబు కంటి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని వైద్యుల సూచన మేరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యారు. చంద్రబాబు విడుదలతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజమండ్రి జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ వద్ద సందడి నెలకొంది. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు నారా లోకేశ్, బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, టీడీపీ ముఖ్య నేతలు జైలు వద్దకు వచ్చారు.