ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడుగా ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నాడో తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌తో చేయబోయే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ దర్శకధీరుడి గురించి తెలియని ఎన్నో విషయాలతో ‘మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు రాఘవ్ ఖన్నా. ఇందులో రాజమౌళి పనితీరు గురించి, ఆయన సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు. అంతేకాదు, అతని గురించి పలువురు సినీప్రముఖుల అభిప్రాయాలను కూడా ఈ డాక్యుమెంటరీలో పొందు పరిచారు. వీరితోపాటు రాజమౌళి భార్య రమా రాజమౌళి కూడా తన భర్తపై తనకు ఉన్న అనుబంధం గురించి, వారి ప్రేమ వివాహం గురించి వివరించారు.
‘ఒక విధంగా కుటుంబాలను కలిపేందుకే మా వివాహం జరిగింది. 2001లో మేం పెళ్లి చేసుకున్నాం. మా సిస్టర్ పెళ్లిలో మొదటిసారి రాజమౌళిని కలుసుకున్నాను. అయితే మొదటి కలయికలో అంత ప్రాధాన్యం లేదనే చెప్పాలి. ఆయన కుటుంబంతో మాకు బంధుత్వం ఉంది. ఒకసారి రాజమౌళి నాకు ప్రపోజ్ చేసినపుడు చాలా షాక్ అయ్యాను. వెంటనే నో అని కూడా చెప్పాను. అప్పుడు నేను వున్న పరిస్థితుల్లో అదొక అర్థంలేని ప్రపోజల్ అనిపించింది. అప్పటికే విడాకులు తీసుకొని మా అబ్బాయితో ఉంటున్నాను. మా అబ్బాయిపై నాకు ఉన్న బాధ్యత వల్లే రాజమౌళి ప్రపోజల్‌ను ఒప్పుకోలేదు. అతనితో వైవాహిక జీవితం ఎలా ఉంటుందోనని డౌట్ పడ్డాను. అయితే కెరీర్ విషయంలో ఎంత పట్టుదలగా ఉంటారో, వ్యక్తిగత జీవితంలోనూ అదే డెడికేషన్ చూపిస్తారని తర్వాత తెలిసింది. సంవత్సరంపాటు రాజమౌళిని గమనించిన తర్వాతే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అతనికి సినిమాల విషయంలో పని రాక్షసుడు అనే పేరుంది. కానీ, పర్సనల్ లైఫ్‌లో పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఖాళీ సమయం దొరికితే ఆరోజంతా ఎంతో లేజీగా ఉంటారు. ఇంట్లోనే ఉండి ఏదో ఆలోచిస్తూ గడుపుతారు. గేమ్స్ ఆడడం ద్వారా బద్ధకాన్ని వదిలించుకునేందు ట్రై చేస్తారు’ అంటూ వివరించారు రమా రాజమౌళి.