లక్ అంటే రాజు గారిదే అని బీజేపీతో అంతా అంటున్నారు. ఆయనకు ఒకేసారి రెండు పదవులు దక్కాయి. విశాఖ నార్త్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా కూటమి తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన విష్ణు కుమార్ రాజుని ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇచ్చిన లేఖతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆయనకు అసెంబ్లీలో గుర్తింపు ఇచ్చారు.
ఇది ఒక ప్రమోషన్ అయితే ప్యానల్ స్పీకర్ల జాబితాలో విష్ణు కుమార్ రాజు పేరుని కూడా చేరి అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. దాంతో రాజు గారికి డబుల్ ఢమాకా దక్కిందని అంతా అంటున్నారు. బీజేపీలో 2014లో అనూహ్యంగా నార్త్ టికెట్ దక్కించుకుని పొత్తులలో భాగంగా తొలిసారి ఎమ్మెల్యే అయిన రాజు 2024 లో మరోసారి గెలిచారు.
ఆయన టీడీపీ అధినాయకుడు చంద్రబాబు అంటే ఎక్కువగా ఇష్టపడతారు అని అంటారు. గతంలో కూడా అసెంబ్లీలో బాబుని ఆయన ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి మంత్రివర్గ విస్తరణలో కూటమి తరఫున సీనియర్ గా ఆయనకు చాన్స్ వస్తుందని అనుకున్నారు. అది దక్కకపోయినా ప్రస్తుతం రెండు కీలక పదవులు వరించడంతో రాజు గారా మజాకానా అని అంతా అంటున్నారు.
బీజేపీ పక్ష నేతగా ఆయనకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడేందుకు ఎక్కువ అవకాశాలు ఇస్తూండడంతో ఆయన కాషాయ పార్టీలో కీలక నేతానే కాదు రాష్ట్ర స్థాయి నేతగానూ ఎదిగారు అని అంటున్నారు. జగన్ వైసీపీల మీద ఎపుడూ ఘాటు విమర్శలు చేసే నేతగా రాజు ఉండడం కూడా ఆయనకు కలసి వచ్చిన అంశంగా మారింది అని అంటున్నారు.