నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్లంటే చిన్నచూపు అనే అభిప్రాయముంది. ఇది నిజమని కొందరు తమ నోటి దురుసుతో రుజువు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సినీ రంగం విషయంలో నార్త్, సౌత్ అనే తేడా కనిపిస్తూ ఉంటుంది. హిందీ హీరోలకు నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉంటుంది. దాంతో సౌత్ హీరోల కంటే తాము గొప్ప అనే అభిప్రాయం వారిలో ఉండటం సహజం. అయితే కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారుతూ వస్తోంది. సౌత్ హీరోలు పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్నారు. అందునా ముఖ్యంగా తెలుగు హీరోలు.. హిందీ హీరోలను డామినేట్ స్థాయికి ఎదుగుతున్నారు. దాంతో తెలుగు స్టార్స్ ని చూసి హిందీ స్టార్లు అసూయ పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు హీరోలు, హిందీ హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి.
ఇటీవల ప్రభాస్ నటించిన ‘సలార్’, షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ ఒకేసారి విడుదలయ్యాయి. ఆ సమయంలో ప్రభాస్, షారుఖ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది. ఒకరినొకరు దారుణంగా ట్రోల్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ అభిమానుల వంతు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చరణ్, షారుఖ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవే జరుగుతోంది.
బాలీవుడ్ స్టార్స్ వేదికలను పంచుకున్నప్పుడు ఒకరి మీద ఒకరు సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అవి హద్దు మీరినట్లు అనిపించినా కూడా వారు ఫీల్ అవ్వరు. ఎందుకంటే అది వారికి అలవాటైపోయింది. కానీ మన దగ్గర అటువంటి కల్చర్ ఉండదు. హీరోలు ఒకరితో ఒకరు సరదాగా ఉంటారు కానీ.. అభిమానులను హర్ట్ చేసేలా పబ్లిక్ వేదికలపై ఒకరి మీద దారుణమైన జోకులు వేసుకోరు. కానీ షారుఖ్ ఖాన్ పుణ్యమా అని తాజాగా రామ్ చరణ్ అభిమానులకి అలాంటి అనుభవమే ఎదురైంది.
అంబానీ తయనుడి వివాహానికి పలువురు స్టార్స్ హాజరై తమదైన శైలిలో వినోదాన్ని పంచారు. ముఖ్యంగా ఖాన్ త్రయం.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తెగ హడావుడి చేశారు. ముగ్గురు కలిసి వేదికపై స్టెప్పులేశారు. ఇక “నాటు నాటు” సాంగ్ ప్లే అవుతున్న సమయంలో.. చరణ్ అక్కడే ఉన్నాడని తెలుసుకున్న షారుఖ్.. ఆయనను స్టేజ్ మీదకు పిలవబోతూ కామెడీ చేశాడు. “రామ్ చరణ్ ఎక్కడున్నావ్?.. ఇడ్లీ సాంబార్ తిని కూర్చున్నావా?.. ఇడ్లీ వడ రామ్ చరణ్” అంటూ సరదాగా పిలిచాడు. ఆ తర్వాత చరణ్ వేదికపైకి వచ్చి.. ఖాన్ త్రయంతో కలిసి స్టెప్పులేశాడు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. చరణ్ ని షారుఖ్ “ఇడ్లీ వడ” అని పిలవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. షారుఖ్ మాటల్లో సౌత్ స్టార్స్ పట్ల చులకన భావం కనిపించిందని, చరణ్ వంటి బిగ్ స్టార్ ని పట్టుకొని అలా పిలవడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చరణ్ ఫ్యాన్స్ తో పాటు మిగతా తెలుగు స్టార్ల అభిమానులు కూడా షారుఖ్ తీరుని తప్పుపడుతున్నారు. ఇక చరణ్ సతీమణి ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబాహాసన్ సైతం గ్లోబల్ స్టార్ ని పట్టుకొని షారుఖ్ అలా పిలవడం బాధ కలిగిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే షారుఖ్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఘటనను సమర్థిస్తున్నారు. చరణ్ తో షారుఖ్ కి మంచి బాండింగ్ ఉందని, అందుకే అలా పిలిచాడని అంటున్నారు. పైగా అది షారుఖ్ నటించిన సినిమాలోని ఒక డైలాగ్ అని చెబుతూ సోషల్ మీడియాలో మూవీ క్లిప్ ని వైరల్ చేస్తున్నారు. అయినా ఇది బాలీవుడ్ లో కామన్ అని.. ఒకరినొకరు సరదాగా అనుకుంటారని చెబుతున్నారు.
మొత్తానికైతే షారుఖ్ కి చరణ్ అవమానించాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదని.. అది కేవలం సరదాగా అన్నాడని.. మన దగ్గర అలాంటి కల్చర్ లేకపోవడంతో మనకి అవమానించినట్లు అనిపిస్తుంది అనేది ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే అర్థమవుతున్న విషయం.