విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘లియో’. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదలను నిలిపివేయాలంటూ పిటిషన్ దాఖలు కావడంతో కోర్టు రిలీజ్‌కు స్టే ఇచ్చిందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ‘లియో’ తెలుగు రిలీజ్ రైట్స్‌ను నాగవంశీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగవంశీ మాట్లాడుతూ ‘‘అక్టోబర్ 19న ఉదయం 7 గంటల షోలతో లియో విడుదలవుతుంది. దసరా సెలవుల్లో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను.
తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. తెలుగులో లియో టైటిల్‌ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుంది. లియో తెలుగు టైటిల్‌ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించి ఉన్నారు. పైగా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక్కడ తెలుగులో లియో టైటిల్‌ని వేరొకరు కూడా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి.. వాళ్ళకి గానీ, మాకు గానీ ఎటువంటి నష్టం జరగకుండా సమస్యని పరిష్కరించుకుంటాం. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతోనే తెలుగు హక్కులు తీసుకోవడం జరిగింది. ఈ దసరాకు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి థియేటర్ల సమస్య ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, అలాంటిదేమీ లేదు. ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ సినిమా విడుదలవుతుంది. లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు ఎటువంటి సమస్య లేకుండా ఏ సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు ఆ సినిమాకి కేటాయించారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. భగవంత్ కేసరి ఘన విజయం సాధించాలని, అంతకంటే పెద్ద హిట్ సినిమా బాలకృష్ణగారితో మేము తీయాలని కోరుకుంటున్నాను.
మేము నిర్మించిన వాతి(సార్) చిత్రాన్ని తమిళ్‌లో లలిత్‌కుమార్‌గారు విడుదల చేశారు. ఆ సమయంలో ఏర్పడిన అనుబంధంతో ఇప్పుడు తెలుగులో మేము ‘లియో’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ ఆదివారంలోపు హైదరాబాద్‌లో లియో వేడుక నిర్వహించాలి అనుకుంటున్నాం. లోకేష్ కనగరాజ్‌గారు, అనిరుధ్‌గారు, త్రిషగారు ఈ వేడుకకు హాజరవుతారు. ఇక మహేష్‌బాబుతో చేస్తున్న ‘గుంటూరు కారం’ గురించి చెప్పాలంటే మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తాం. దాని గురించి దసరా పండగ సందర్భంగా తెలియజేస్తాం’’ అన్నారు.