‘ఏజెంట్’ డిజాస్టర్ తో ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్ (Akkineni AKhil).. వరుస క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ‘ధీర’ అనే భారీ ప్రాజెక్ట్ ని కమిట్ అయ్యాడు. ఈ సినిమాతో అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం. దీంతో పాటు మరో ప్రాజెక్ట్ కి కూడా ఓకే చెప్పాడు అఖిల్.
‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయనున్నాడు. నాగార్జున, నాగ చైతన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి ‘లెనిన్’ అనే టైటిల్ ని ఖరారు చేశారని టాక్. లెనిన్ పేరు వింటే కమ్యూనిజం గుర్తుకొస్తుంది. ఆయన రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. అలాంటి ‘లెనిన్’ టైటిల్ తో అఖిల్ సినిమా చేయనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
2015 లో హీరోగా పరిచయమైన అఖిల్, ఇప్పటిదాకా ఐదు సినిమాలు చేయగా.. అందులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మినహా అన్నీ పరాజయం పాలయ్యాయి. అక్కినేని వారసుడిగా ఎన్నో అంచనాల నడుమ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. ఆ అంచనాలకు అందుకోలేకపోతున్నాడు. అందుకే అఖిల్ చేసే కొత్త సినిమాల విషయంలో నాగార్జున ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడట. ఆలస్యమైనా పర్లేదు మంచి కథలను ఎంపిక చేయాలని చూస్తున్నాడట. ‘ధీర’, ‘లెనిన్’ కథలు నాగార్జునకు ఎంతగానో నచ్చాయని.. ఈ రెండు సినిమాలతో అసలుసిసలైన అఖిల్ ని చూస్తారని అంటున్నారు.