సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరి లైఫ్ టర్న్ అవుతుందో తెలియదు. సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తున్నా రాని క్రేజ్, ఒక్క సినిమాతో ఒక్కసారిగా రావొచ్చు. అలా లేట్ వయసులో క్రేజ్ తెచ్చుకొని, వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటులు కొందరున్నారు. ఆ కొందరు నటుల్లో తమిళ నటుడు జార్జ్ మరియన్ ఒకరు.
థియేటర్ ఆర్టిస్ట్ అయిన జార్జ్ మరియన్.. 20 ఏళ్ళ క్రితం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2002 లో విడుదలైన ‘ఆజాగి’ అనే సినిమాతో నటుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. అయితే ఆయనకు గుర్తింపు రావడానికి మాత్రం దాదాపు ఆరేళ్ళు పట్టింది. 2008లో విడుదలైన ‘కాంచీవరం’తో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘పోయి సొల్ల పోరోమ్’, ‘మద్రాస పట్టినం’, ‘దైవ తిరుమగల్’, ‘శైవం’ వంటి సినిమాలతో తన ప్రతిభను చాటుకున్నారు. అయితే జార్జ్ మరియన్ ప్రతిభకు తగ్గ బిగ్ బ్రేక్ రావడానికి మాత్రం ఏకంగా 17 ఏళ్ళు పట్టింది.
కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఖైదీ’. 2019లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నెపోలియన్ అనే కానిస్టేబుల్ పాత్ర పోషించారు జార్జ్ మరియన్. ఆ సినిమాకు ఎంత పేరు వచ్చిందో, ఆయన పోషించిన ఆ నెపోలియన్ పాత్రకి కూడా అంతే పేరొచ్చింది. ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ఆయనకు బడా అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తమిళ్ తో పాటు ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. అలాగే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఆయన పోషిస్తున్న నెపోలియన్ పాత్ర కీలకం. ‘ఖైదీ’లో అదరగొట్టిన ఆ పాత్ర లియో లోనూ అలరించింది. భవిష్యత్ లో ఈ యూనివర్స్ లో భాగంగా రానున్న సినిమాల్లో ఆయన పాత్ర మరింత కీలకం కానుంది అంటున్నారు. దీనితో పాటు ‘ఇండియన్-2’ సహా పలు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు జార్జ్ మరియన్. కాస్త ఆలస్యంగా ప్రతిభకు తగ్గ గుర్తింపు తెచ్చుకున్న 60 ఏళ్ళ ఈ నటుడు, ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు.