దిశ, ఫీచర్స్ : ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. వచ్చీపోయే మనుషులు, గుంపులుగా ఉన్న పశువులతో కిటకిటలాడుతోంది. కొందరు వ్యక్తులు తమతోపాటు పశువులను తోలుకొస్తున్నారు. మరి కొందరు ఎద్దులను తీసుకొచ్చిన వ్యక్తులతో మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే అది పశువులను విక్రయించే సంత అనేది స్పష్టం అవుతోంది. అయితే అంతలోనే అక్కడికి వచ్చిన ఓ మహిళా జర్నలిస్టు లైవ్‌లో మాట్లాడుతోంది.
పశువులు, సంతలో వాటి ధర గురించి సదరు మహిళ మాట్లాడటం ప్రారంభించింది. ‘ధరలపై వ్యాపారులు మొండిగా వ్యవహరిస్తూ.. రూ. 5 లక్షలు మొదలుకొని..’ అంటూ ఆమె ఏదో చెప్పబోతుండగా అకస్మాత్తుగా ఓ ఎద్దు వచ్చి ఆమెపై దాడిచేసింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయింది. కిందపడ్డ మహిళా జర్నలిస్టుకు మైక్ హ్యాండిల్ చేస్తున్న వ్యక్తి హెల్ప్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులోని సమాచారాన్ని బట్టి పాకిస్తాన్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా మహిళా జర్నలిస్టుపై ఎద్దు దాడిచేయడం, ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడం, పైగా ఇదంతా ఊహించని రీతిలో ఫన్నీగా జరగడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఇది చూసిన వారంతా నవ్వుకోవడంతోపాటు ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.