దిశ, ఫీచర్స్ : మనం ఆధునిక కాలంలో ఉన్నప్పటికీ కొన్ని పాత కాలపు విషయాలు, సమాచారాలు, సంఘటనలు ఇప్పటికీ వింతగానూ, ఆసక్తిగానూ అనిపిస్తుంటాయి. అందుకేనేమో పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు. ప్రస్తుతం వివిధ వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకూ రూపాయి విలువ పడిపోతోంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు నలుగురు పెద్ద మనుషులు ఒకచోట కలిస్తే చాలు, ఇప్పటి పరిస్థితులు, ధరలు వంటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు పాత రోజులు మళ్లీ వస్తే బాగుండేదని గుర్తు చేస్తుంటారు.
వాస్తవానికి పదేళ్ల క్రితం కూడా ఆయా వస్తువుల ధరలు తక్కువగా ఉండేవట. అంతకు ముందు సంవత్సరాల్లో పదిరూపాయలు చేతిలో ఉంటే నెలకు సరిపడా వస్తువులు వచ్చేవని చెప్తుంటారు. కానీ ప్రస్తుతం పది రూపాయలకు సింగిల్ టీ కూడా రాని పరిస్థితిని మనం చూస్తున్నాం. పలువురు అప్పటికీ, ఇప్పటికీ మారిన రేట్ల తీరును పోల్చుతూ సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి విషయమే ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఏంటంటే.. ఒక వ్యక్తి 1915లో ఒక ట్రైన్ టికెట్ ధర ఎంత ఉండేదో పేర్కొంటూ పోస్టు చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న పాతకాలపు ట్రైన్ టికెట్ వివరాలను బట్టి చూస్తే అది నవంబర్ 4 , 1915 నాటిది అని తెలుస్తోంది. ప్రయాణికుడు దానిని పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి పాకిస్థాన్‌లోని లాహోర్ కంటోన్మెంట్‌కి తీసుకున్నాడు. ఇక ధర విషయానికి వస్తే కేవలం రూ. 3 మాత్రమే ఉంది. ఇప్పుడు మూడు రూపాయలు అంటే మనకు చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ అప్పట్లో అవే మహాభాగ్యమట. ప్రజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ ట్రైన్ టికెట్ ధరను చూసిన వారంతా పాతరోజులు మళ్లీ వస్తే బాగుండేవని కామెంట్ చేస్తున్నారు.