మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. రెండు పాటలు, ఒక ఫైట్ సీన్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని.. ఆగస్టు నెలాఖరుకి మొత్తం షూట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు, త్వరలోనే చిరంజీవి మరో సినిమాని మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. (Mega 157)
‘గాడ్ ఫాదర్’ దర్శకుడు మోహన్ రాజాతో చిరంజీవి మరో మూవీ చేస్తారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఆ వార్తలు నిజం కాబోతున్నాయి. ‘విశ్వంభర’ తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమాకి మోహన్ రాజానే దర్శకుడు. బి.వి.ఎస్ రవి ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై చిరంజీవి కుమార్తె సుష్మిత ఈ చిత్రాన్ని నిర్మించనుందట. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.
చిరంజీవి కెరీర్ లో ఇది 157వ సినిమాగా రూపొందనుంది. అంతేకాదు, ఈ చిత్రంలో పెళ్లి అయిన మధ్య వయస్కుడి పాత్రలో చిరంజీవి కనిపిస్తారట. ‘గాడ్ ఫాదర్’ మూవీలో కూడా.. మెగాస్టార్ వయసుకి తగ్గ పాత్రలో నటించి మెప్పించారు. మరి ఇప్పుడు ఈ కొత్త చిత్రంలో చిరంజీవిని.. దర్శకుడు మోహన్ రాజా ఎలా చూపిస్తాడోనన్న ఆసక్తి నెలకొంది.