దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో ఓ వైపు దోమల బెడద, మరోవైపు సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువ. వానలు కురువడంవల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతుంటాయి. రోడ్లపై, కాలనీల్లో ప్రవహించే మురుగు నీరు, భూమిలోకి ఇంకి తాగునీటిలో కలువడంవల్ల కలుషితం అవుతుంది. ఈ నీటిని తాగడంవల్ల ప్రజలు జలుబు, దగ్గు, ఫ్లూ, కళ్లకలక, గొంతు నొప్పి సహా వివిధ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే చాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇలా జరగకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
కలుషిత నీరు తాగడంవల్ల వాంతులు, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి వర్షాకాలంలో ట్యాబ్ వాటర్‌ను నేరుగా తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కాచి వడబోసి తాగడం వల్ల సీజనల్ వ్యాధులు, ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. పైగా గోరు వెచ్చని నీరు గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతోపాటు సీజనల్‌గా లభించే పండ్లను తింటూ ఉండటంవల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అందుకోసం నారింజ, నేరేడు, బత్తాయి, కీర, అరటి వంటి పండ్లను తినాలి. యాంటీ యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఎండు మిర్చి, దాల్చిన చెక్క, తులసి ఆకులతో చేసిన సూప్‌లు, అల్లం టీ, గోరు వెచ్చని పాలల్లో పసుపు కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు వంటి ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా సహాయపడతాయని ఆయుర్వేదిక్ నిపుణులు సూచిస్తున్నారు.