దిశ, ఫీచర్స్: వాటర్ అలెర్జీ కూడా ఉంటుందని మీకు తెలుసా? ఈ అరుదైన పరిస్థితిని అక్వాజెనిక్ ఉర్టికేరియా అని పిలుస్తారు. నీటికి ఎక్స్ పోజ్ అయినప్పుడు దద్దుర్లు, ఇతర అలెర్జిక్ రియాక్షన్స్ వచ్చేస్తాయి. వర్షం, చెమట, కన్నీరు, ఒక్కోసారి లాలాజలం కూడా ఇందుకు కారణం అవుతుంది. ఒత్తిడి, సూర్యకాంతి, ఉష్ణోగ్రత ఇలాంటి లక్షణాలను మరింత పెంచుతాయి. యుక్తవయసు వచ్చాక ఈ అలెర్జీ మొదలవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో జీన్స్ కూడా కీలకంగా ఉంటుంది.
ఎలా తెలుసుకోవాలి?
నీటి అలెర్జీ సాధారణ లక్షణం వెంటనే దద్దుర్లు వచ్చేయడం. రోగికి వాటర్ అంటడంతోనే స్టార్ట్ అయిపోతుంది. పరిస్థితి తీవ్రమైతే తలనొప్పి, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పెదవుల వాపు, గొంతు వాపు రావచ్చు. ఈ పరిస్థితి రోజువారీ జీవితాన్ని ఎంత దారుణంగా ప్రభావితం చేస్తుందో.. స్నానం, స్విమ్మింగ్, వర్షంలో ఎంజాయ్ చేయడాన్ని కూడా అంతే ఘోరంగా ఎఫెక్ట్ చేస్తుంది. అయితే ఈ పరిస్థితికి కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఇంకా కృషి చేస్తున్నారు. హిస్టామిన్ విడుదల కారణంగా దద్దుర్లు వస్తుండగా.. అలెర్జీ ప్రతిచర్యగా చర్మం కింద ఉన్న మాస్ట్ కణాలు దీన్ని రిలీజ్ చేస్తాయి. ఇది దద్దుర్లను మరింత ప్రేరేపిస్తుంది. కానీ ఈ హిస్టామిన్ విడుదలకు కారణమేంటో ఇంకా తెలియలేదు.
ఎలా నిర్ధారిస్తారు?
మీకు వాటర్ అలెర్జీ ఉందో లేదో తెలుసుకునేందుకు వైద్యులు శారీరక పరీక్ష నిర్వహిస్తారు. మెడికల్ హిస్టరీ చూడటంతోపాటు వాటర్ అలెర్జీ టెస్ట్ చేస్తారు. ఇందులో భాగంగా డాక్టర్ గది ఉష్ణోగ్రత వద్ద నీటి కంప్రెస్ ను ఛాతీపై 30 నిమిషాల పాటు ఉంచుతారు. రియాక్షన్ ను ప్రేరేపించేందుకు ఇలా చేస్తారు. దీని రిజల్ట్ ను అక్వాజెనిక్ ప్రూరిటస్ లక్షణాలతో పోల్చుతారు. అక్వాజెనిక్ ప్రూరిటస్ , అక్వాజెనిక్ ఉర్టికేరియా మాదిరి లక్షణాలు దురద, చికాకు కలిగి ఉంటుంది. కానీ దద్దుర్లు, చర్మం ఎర్రబడేందుకు కారణం కాదు.
నివారణ ఉందా?
అక్వాజెనిక్ ఉర్టికేరియాకు ఇప్పటి వరకు ఎలాంటి నివారణ లేదు. అయితే ఈ లక్షణాలను నివారించేందుకు అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. యాంటీహిస్టామైన్స్ హిస్టామిన్ విడుదలను ఆపేస్తాయి. వాపును తగ్గిస్తాయి. కార్టికోస్టెరాయిడ్స్, లుకోబ్రీన్ ఇన్హిబిటర్స్, ఫోటో థెరపీ వంటి మెడికేషన్ ఇస్తుంటారు నిపుణులు.