సైబర్ మోసాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. జనం ఎక్కడుంటే సైబర్ మోసం అక్కడ పుట్టుకొస్తోంది. టెక్నాలజీపై అవగాహన లేమిని, వాళ్ల అత్యాసను క్యాష్ చేసుకునేందుకు రోజుకో రూపంలో తెరపైకొస్తోంది సైబర్ మోసం.
మొన్నటికిమొన్న తెలంగాణలో స్కీముల్ని ఆసరాగా చేసుకొని ఎన్నో సైబర్ మోసాలు పుట్టుకొచ్చాయి. చివరికి మైక్రోసాఫ్ట్ సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యను కూడా ఆసరాగా చేసుకొని ఆన్ లైన్ మోసాలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ప్రవేశించింది.
“హర్ష సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ ఛారిటీ చేస్తున్నాం. పూర్తిగా పేదవాళ్లకు మాత్రమే ఈ అవకాశం. ఈ గ్రూప్ లో ఎవరైనా పేదవాళ్లు ఉంటే వాళ్లు మాకు 2వేల రూపాయలు ట్రన్సఫర్ చేయండి. ప్రతిగా వాళ్లకు 18,500 రూపాయలు వేస్తాం. మిగతా దాతలు అందించిన సహకారంతో ఈ సహాయం చేస్తున్నాం. మీరు ఇచ్చిన 2వేల రూపాయలు మరో పేద కుటుంబానికి సాయపడుతుంది.”
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని చాలా వాట్సాప్ ఛాట్స్ లో కనిపిస్తున్న మెసేజీ ఇది. నిజంగా మీకు మంచి మనసుంటే ఏదైనా అనాదాశ్రమానికి నేరుగా వెళ్లి వస్తురూపేణా సహాయం చేయండి. ఇలాంటి మెసేజీలకు మాత్రం పడిపోవద్దు. ఎందుకంటే, మీరు అలా డబ్బులు ట్రాన్సఫర్ చేసిన వెంటనే మీ నంబర్ ను వాళ్లు బ్లాక్ చేస్తారు. అంతేకాకుండా, వాళ్లు చెప్పిన లింకులు క్లిక్ చేసిన వాళ్ల ఖాతాలు హ్యాక్ అయిన సందర్భాలూ ఉన్నాయి.
ఇలాంటి సందేశాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఫార్వార్డ్ చేస్తున్నారు చాలామంది. అలా ఫార్వార్డ్ చేయడం కంటే బ్లాక్ చేయడం ఉత్తమమని చెబుతున్నారు సైబర్ నిపుణులు. దీనికంటే ముఖ్యంగా పరిచయం లేని వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగాలని సూచిస్తున్నారు.