దిశ, ఫీచర్స్ : మ్యూజిక్ ఇండస్ట్రీ అంటేనే చాలా మందికి ఎలక్ట్రీ ఫ్లయింగ్ పర్ఫామెన్స్ గుర్తుకొస్తుంది. ఆకట్టుకునే సంగీత కచేరీలు, అలరించే పాటలు, మైమరిపించే ప్రదర్శనలు మనసులో మెదలుతాయి. ఎక్కడ మ్యూజిక్ ఈవెంట్స్ జరిగినా వెలుగు జిలుగుల ఫోకస్ లైటింగ్స్ కూడా ఆకట్టుకుంటుంటాయి. అయితే స్టేజ్ డిజైనింగ్ మొదలు మ్యుజిషన్స్ వాడే వాయిద్య పరికరాల వరకు పర్యావరణ కాలుష్యాన్ని కూడా కలిగిస్తాయని చెప్తుంటారు. కానీ కొందరు సంగీత కారులు, రాక్ బ్యాండ్ నిర్వాహకులు మాత్రం తమ వృత్తిని పర్యావరణ హితంగా మల్చుకున్నారు. ప్రవృత్తిగా ప్రకృతి పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అటువంటి మ్యుజిషన్స్ అండ్ ర్యాక్ బ్యాండ్స్ గురించి తెలుసుకుందాం.
మైలీ సైరస్
మైలీ సైరస్ (Miley Cyrus) ప్రముఖ అమెరికన్ సింగర్, రైటర్ అండ్ యాక్ట్రస్ కూడాను. ‘Pop Chameleon’ అని కూడా పిలుస్తారు. కళా రంగంలో ఆమె బహుముఖ ప్రజ్ఞవల్ల ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అయితే పర్యావరణవాదం పట్ల ఈమె ఆసక్తి, అభిరుచి క్రియాశీలతకు మించి విస్తరించింది. ఆమె సంగీత పర్యటనలను కూడా ప్రభావితం చేస్తుంది. తన ప్రదర్శనల సమయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం వంటి పర్యావరణ అనుకూల పద్ధతులను చేర్చడం ద్వారా సుస్థిరతను యాక్టివ్‌గా ప్రమోట్ చేస్తుంది. ఈ స్పృహతో కూడిన ఎంపికలు మొత్తం ఎంటర్టైన్‌మెంట్ ఇండస్ట్రీకి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
అదితి వీణ అకా దిట్టి
అదితి వీణ అకా దిట్టి ( Aditi Veena aka Ditty) గొప్ప సంగీత విద్వాంసకురాలు 2020లో ఆమె ‘మేక్ ఫారెస్ట్స్ నాట్ వార్’ అనే కార్బన్-న్యూట్రల్ టూర్‌ను ప్రారంభించింది. ఈ పర్యటనలో భాగంగా ఆమె తన ప్రయాణాల సందర్భంలో కార్బన్ ఉద్గారాలను సమతుల్యం చేయడానికి కృషి చేస్తోంది. ప్రయాణంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా స్థానికంగా మొక్కలు నాటింది. ఇప్పటికీ అదే కొనసాగిస్తోంది. ఈ చొరవ పర్యావరణ పరిరక్షణలో ఎంతో ఉపయోగపడుతోంది. అంతేకాకుండా స్థిరమైన అడవుల సృష్టికి దోహదపడింది.
బిల్లీ ఎలిష్
బిల్లీ ఎలిష్ (Billie Eilish) ఎకో-కాన్షియస్ విలువలకు కట్టుబడి ఉన్న గొప్ప సంగీత విద్వాంసకురాలు. తన కచేరీలను కూడా ఇందుకు అనుగుణంగా నిర్వహిస్తుంది. 2022లో ఎలిష్ యొక్క ‘‘హ్యాపీయర్ దాన్ ఎవర్’’ టూర్‌లో పునర్వినియోగ నీటి సీసాలు, రీసైకిల్ చేసిన మెటీరియల్స్‌తో తయారు చేయబడిన వస్తువులు ఉపయోగించారు. మొక్కల ఆధారిత క్యాటరింగ్ ఎంపికలను పొందుపరిచారు. ఇవి భవిష్యత్ పర్యటనలకు ఉదాహరణగా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.
కోల్డ్ ప్లే రాక్ బ్యాండ్
కోల్డ్ ప్లే.. అనేది 1997లో లండన్‌లో ఏర్పడిన బ్రిటిష్ రాక్ బ్యాండ్. ఇందులో గాయకుడు, పియానిస్ట్ క్రిస్ మార్టిన్, గిటారిస్ట్ జానీ బక్‌ల్యాండ్, బాసిస్ట్ గై బెర్రీమాన్, డ్రమ్మర్ విల్ ఛాంపియన్, మేనేజర్ ఫిల్ హార్వే ఉన్నారు. వీరంతా 2023లో ‘మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్’ పేరుతో పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రదర్శనలు నిర్వహించినా పునరుత్పాదక ఇంధన వనరులను ఈ రాక్ బ్యాండ్ టీమ్ ఉపయోగించుకుంటోంది. ప్లాంట్-బేసిస్ బిజినెస్ కొనసాగిస్తోంది. కార్యక్రమాల్లో తన పాటలు, సంగీతం ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతోంది.
ఇండియన్ ఓషియన్
‘హిందూ మహాసముద్రం’ పేరు పెట్టుకున్న ఈ రాక్ బ్యాండ్ పర్యావరణ క్రియాశీలతకు (environmental activism) ప్రసిద్ధి చెందింది. దాని కచేరీలలో స్థిరమైన అంశాలను చేర్చింది. ఇందులోని సభ్యులు స్టేజ్ సెటప్ కోసం రీసైకిల్ చేసిన మెటీరియల్స్ మాత్రమే ఉపయోగిస్తారు. ఇక సంగీత కచేరిల్లోనూ అభిమానులలో, ప్రేక్షకులలో పర్యావరణ అనుకూల పద్ధతులను చురుకుగా ప్రోత్సహిస్తారు. ఇది ఎంతో మేలు చేస్తోందని పర్యావరణ ప్రేమికులు కూడా ప్రశంసిస్తున్నారు. బ్యాండ్ మ రేవా అండ్ చీటు వంటి పాటలతో ఓషియన్ రాక్ బ్యాండ్ సంగీతంలో పర్యావరణ స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది.
రేడియో హెడ్
రేడియోహెడ్ (Radiohead) అనేది ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని అబింగ్‌డన్‌లో ఏర్పడిన ఒక రాక్ బ్యాండ్ సంస్థ. 2000వ దశకం ప్రారంభం నుంచి ఇది సుస్థిరమైన పద్ధతులకు మార్గదర్శకత్వం వహిస్తోంది. 2017లోని దీని పర్యటన, ప్రదర్శనల సందర్భంగా ఎనర్జీ-ఎఫీసియెంట్ (శక్తి-సమర్థవంతమైన) స్టేజ్ లైటింగ్, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, స్థానిక ఆహార వనరులను మాత్రమే వినియోగించడం ఎందరిలోనో మార్పు తెచ్చాయి. ఇక సంగీత కచేరిల్లోనూ ఈ సంస్థ ప్రజల్లో చైతన్యం కల్పిస్తోంది. పర్యావరణ బాధ్యతను పెద్ద ఎత్తున ఉత్పత్తిలో సజావుగా విలీనం చేయవచ్చని రుజువు చేసింది.
మాసివ్ ఎటాక్
మాసివ్ అటాక్ (Massive Attack) అనేది బ్రిటీష్ ట్రిప్-హాప్ గ్రూప్. సంగీత కచేరీలు, కళా ప్రదర్శనలకు సంబంధించిన ప్రఖ్యాతి సంస్థ. చాలా కాలంగా పర్యావరణ సమస్యలత గురించి బహిరంగంగా మాట్లాడుతోంది. 2019లో ‘మెజ్జనైన్ XXI’ పర్యటనలో భాగంగా లో-కార్బన్ స్టేజ్ డిజైన్, ఎనర్జీ-ఎఫీసియంట్ లైటింగ్ అండ్ కార్బన్ ఫూట్‌ప్రింట్ ఆఫ్‌సెట్ చేయడంలో నిబద్ధత, స్థిరత్వం పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించింది. ఇప్పటికీ కర్బన ఉద్గారాలు, వాయు కాలుష్యం, చెట్ల పెంపకం వంటి అంశాలపై చైతన్యం కల్పిస్తోంది.