ఈవో బదిలీపై చర్చ
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో జరగాల్సి ఉండగా.. దుర్గగుడి ఈవో బదిలీ చర్చనీయాంశం అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఈవో భ్రమరాంబను బదిలీ చేయడం కలకలం రేపింది. ఈవో భ్రమరాంబ బదిలీకి కొద్ది నెలలుగా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబు తీవ్ర ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. ఇటీవల విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈవోను మార్చాలని ఆలయ ఛైర్మన్ నేరుగా సీఎం జగన్ కు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పరిధిలో వారు ఉండాలని హెచ్చరించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ పలుమార్లు హెచ్చరించిన తర్వాత కూడా వెల్లంపల్లి, కర్నాటిలు తమ ప్రయత్నాలు కొనసాగించారు. రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయాల్లో ఒకటైన ఇంద్రకీలాద్రిని తమ గప్పెట్లో ఉంచుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకీలాద్రి జోలికి రాకూడదన్నట్లు వ్యవహరించడంతో ఆ శాఖ మంత్రికి ఆగ్రహం తెప్పించింది. గత ఏడాది జరిగిన దసరా ఉత్సవాల్లో మంత్రి సత్యనారాయణ దగ్గరుండి పర్యవేక్షించారు. దీంతో కొట్టు, వెల్లంపల్లికి మధ్య విభేదాలు తలెత్తాయి. తన శాఖకు సంబంధించిన కార్యక్రమాలపై ఇతరుల పెత్తనాన్ని మంత్రి కొట్టు అంగీకరించలేదు.