హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయ మండపంలో జరిగిన ఈ పెళ్లికి.. ఇరు కుటుంబాలతో పాటు అతికొద్దిమంది బంధువులు, స్నేహితులు హాజరయ్యారని సమాచారం.
సిద్దార్ధ్ కి 2003 లో మేఘన అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఆ తర్వాత 2007 లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. హీరోగా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్దార్ధ్.. విడాకుల తర్వాత పలువురితో ప్రేమాయణం నడిపినట్లు వార్తలొచ్చాయి. అందులో స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఒకరిద్దరితో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో ఆ ప్రేమ కథలు పెళ్లి వరకు చేరలేదు. అయితే కొంతకాలంగా అదితిరావుతో ప్రేమలో ఉన్నాడు సిద్ధార్థ్. వీరిద్దరూ కలిసి ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు సమాచారం. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగిన పలు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఈ సంవత్సరమే సిద్ధార్థ్, అదితిరావు పెళ్లి చేసుకోబోతున్నారని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమైనట్లు సమాచారం. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారట. కాగా, అదితిరావుకి కూడా గతంలోనే పెళ్లి జరగగా, ఏవో కారణాల వల్ల కొంతకాలానికే భర్త నుంచి విడాకులు తీసుకుంది.