దిశ, ఫీచర్స్: పిల్లలకు నచ్చిన వస్తువులు కొనివ్వకపోయినా, ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేయకపోయినా పిల్లలు తల్లిదండ్రులపై విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తారు. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాదు. చేతిలో ఏం ఉన్నా నేలకేసి కొట్టేస్తారు. ఆ టైంలో కొంతమంది పిల్లల్ని, పేరెంట్స్ కొట్టడమో, తిట్టడమో చేస్తారు.
కానీ ఈ విధంగా చేస్తే పిల్లలు ఇంకా మొండిగా తయారవుతారు. చెయ్యి దాటి పోతారు. కాగా వారి కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? అసలు ఆ సమయంలో పిల్లలు పేరెంట్స్ నుంచి ఏం వినాలి అనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లలకు కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు వారిని దూరం పెట్టకూడదు. పిల్లల కోపం పోయేంత వరకు వారితోనే ఉండాలి. పిల్లల పక్కనే కూర్చోవాలి.
కోపం అనేది ఒక ఎమోషన్. ముందుగా పేరెంట్స్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిల్లలు కోపాన్ని ప్రదర్శిస్తే ఏదో నేరం చేసినట్లుగా చూడకూడదు. వారికి కోపం వస్తే కోపం పోయేంతవరకు అరవనివ్వండి. కోపం రావడం అనేది చాలా కామన్ అని వారికి తెలియజేయండి. కానీ ఆ కోపాన్ని లిమిట్ లో చూపించాలి. కొన్ని సార్లు విపరీతమైన కోపం వల్ల ఎలాంటి వాటికి దారి తీస్తాయో వారికి తెలియజేయండి.
పిల్లలకు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ముందుగా తాము చెప్పింది వినండి. వినకుండా వారిని నిందించకండి. ఎంత కోపంలో ఉన్నా వారికి మీరు ఉన్నారనే ధైర్యాన్ని నింపే మాటలు చెప్పండి. చేతల రూపంలో ఆ సమయంలో తమపై ప్రేమ చూపించండి.
కోపంలో ఉన్నప్పుడు పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతారు. నా మాట ఎవరు వినడం లేదు. నా కోసం నా తల్లిదండ్రులు ఏం చేయట్లేదు. ఏం కొనివ్వట్లేదు నాకు ఎవ్వరూ లేరు అని నెగిటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో మీరు పిల్లల పక్కనుండి మీ కోసం ఏమైనా చేస్తామని, మీరు ఏం చెప్పినా చేస్తామని చెప్పి బుజ్జగించండి.
పిల్లల కోపం తగ్గే వరకు తల్లిదండ్రులు అసలు ఏం జరిగింది? ఎందుకు కోపం వచ్చింది? అని కూల్ గా వారిని ప్రశ్నించండి. పిల్లలు కోపం తెచ్చుకోవడానికి ఆ కారణం సరైనదేనా? కాదా? అనే విషయాన్ని వారికి వివరించండి.