సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ‘విరూపాక్ష’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్ లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. దీంతో దర్శకుడు కార్తీక్ దండు పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆయన తదుపరి సినిమా ఏ హీరోతోనన్న ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. అయితే ఎట్టకేలకు ఆయన నెక్స్ట్ ఫిల్మ్ నాగ చైతన్యతో లాక్ అయినట్లు తెలుస్తోంది.
గత చిత్రాలు ‘థాంక్యూ’, ‘కస్టడీ’ సినిమాలతో నిరాశపరిచిన నాగ చైతన్య.. మంచి విజయంతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నాడు. గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో చైతన్య జాలరి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేసింది.
ఓ వైపు ‘తండేల్’ షూటింగ్ తో బిజీగా ఉన్న నాగ చైతన్య.. మరోవైపు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్లు సమాచారం. కార్తీక్ దండు చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన చైతన్య.. ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి అంగీకరించినట్లు వినికిడి. ‘విరూపాక్ష’ తరహాలోనే ఈ కథ కూడా వైవిధ్యంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుందట. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కూడా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లోనే రూపొందనుందని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.