దిశ, ఫీచర్స్ : విహార యాత్రలు ఆనందాన్ని మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. కొంగ్రొత్త ప్రదేశాలకు ట్రావెల్ చేయడం, అందమైన ప్రకృతిని, ప్రపంచాన్ని అన్వేషించడం అనేది మధురానుభూతిని, మానసిక వికాసాన్ని కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ట్రావెలింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు అలసిపోతుంటారు కానీ ఆ తర్వాత లభించే రిలాక్సేషన్ అలసటను, ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
విహార యాత్రలకు వెళ్లడం వల్ల మనసులో పాజిటివ్ ఫీలింగ్స్ ఏర్పడతాయి. ప్రయాణాల్లో కదలికలు, ఆయా ప్రాంతాలు, ప్రదేశాల సందర్శన కారణంగా సహజంగానే శరీరానికి అవసరమైన ఫిజికల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. దీంతోపాటు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి భావాలతో ఇబ్బంది పడేవారు ఈ సందర్భంగా ఈజీగా కోలుకుంటారు. పైగా విహార యాత్రలు వింత అనుభవాలను, మధుర జ్ఞాపకాలను, విజ్ఞానాన్ని స్వీకరించేలా ప్రేరేపిస్తాయి. దీనివల్లో మనలో కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెంపొందుతాయి.