posted on Dec 28, 2024 9:30AM
స్నానం శారీరక శుభ్రతలో ప్రధాన భాగం. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించడం చిన్నతనం నుండి అలవాటుగా వచ్చేస్తుంది. కొందరైతే రోజులో రెండుపూటలా స్నానం చేస్తారు. ఇది శరీరానికి చాలా రిఫ్రెషింగ్ అనుభూతి ఇస్తుంది. అధిక శాతం మంది స్నానానికి వేడి నీరే ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీరుతో స్నానం చేస్తుంటారు. ఇది ఎంత వరకు ఆరోగ్యం. బాగా వేడిగా ఉన్న నీటితోస్నానం చేయడం వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? తెలుసుకుంటే..
చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. అందుకే చాలామంది పొగలు కక్కుతున్న నీటితో స్నానం చేస్తారు. చాలా వరకు గమనిస్తే చలికాలంలో స్నానం చేసి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే బాత్రూమ్ నుండి మంచు పొగ బయటకు వచ్చినట్టు వేడనీటి ఆవిర్ల పొగ బయటకు వస్తుంది. పొగలు కక్కే వేడి నీరు శరీరానికి చాలా రిలాక్స్ గా అనిపించినా అది చర్మానికి చాలా చెడు చేస్తుంది. ముఖ్యంగా చర్మం కందిపోవడం, ఎర్రబడటం జరుగుతుంది. చలికాలంలో ముందే చర్మం తొందరగా పొడిబారే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మరింత వేడినీరు పడటం వల్ల చర్మం దెబ్బతింటుంది. చర్మం సహజమైన మెరుపును కోల్పోతుంది.
లో బిపి.. చాలామందికి ఉండే సమస్య. ఈ మధ్యకాలంలో అధిక బీపీ కంటే లో బీపీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. లో బీపీ సమస్యలు ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదని అంటున్నారు. దీని వల్ల శరీరంలో రక్తనాళాలు వ్యాకోచించి రక్తపోటును మరింత తగ్గేలా చేస్తాయట. ఈ కారణంగా శరీరంలో రక్తపోటు తగ్గిపోయి ప్రమాదకర పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంటుందట.
ఎప్పుడో ఒకసారి శరీరం బాగా అలసిపోయినప్పుడు, చాలా చలిగా ఉన్నప్పుడు వేడినీటితో స్నానం చేసినా పర్లేదు.. కానీ ప్రతిరోజూ పొగలు కక్కే నీటితో స్నానం చేస్తుంటే మాత్రం చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారికి చాలా ఇబ్బంది అనే చెప్పాలి. చాలా వేడిగా ఉన్న నీరు చర్మం పిహెచ్ బ్యాలెన్స్ ను పాడు చేస్తుంది. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.
బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చర్మమే అంత దెబ్బతినే అవకాశాలు ఉన్నప్పుడు.. చాలా సున్నితంగా ఉండే తల చర్మం, వెంట్రుకలు మరింత సమస్యకు లోనవుతాయి. బాగా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. వేడి నీరు జుట్టు పొడిగా మారడానికి, సున్నితంగా మారడానికి, డ్యామేజ్ కావడానికి కారణం అవుతుంది. ఫలితంగా జుట్టు పెరుగుదల అస్సలు ఉండదు.
చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది శరీరానికి చాలా ప్రమాదకరంగా పరిగణించబడుతుంది. అందుకే స్నానానికి వేడినీరు ఉపయోగించాలి అనుకుంటే ఆ నీరు గోరువెచ్చగా ఉండాలి. అంతే కానీ పొగలు కక్కే నీటితో స్నానం చేయకూడదు.
*రూపశ్రీ.